Chief Minister: శపథం చేసిన సీఎం స్టాలిన్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-08-26T09:25:38+05:30 IST
విద్య, ఆర్థిక సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నెంబర్ వన్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): విద్య, ఆర్థిక సహా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నెంబర్ వన్ రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) శపథం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బడిపిల్లల అల్పాహార పథకాన్ని విస్తరింపజేసే దిశగా శుక్రవారం ఉదయం నాగపట్టినం జిల్లా తిరుక్కువలైలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) చదివిన ప్రాథమిక పాఠశాలలో ఈ పథకాన్ని స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ... చెన్నై అశోక్‌నగర్‌లో ఓ పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థులు ఉదయం పూట అల్పాహారం తినకుండా వస్తున్నారని తెలుసుకుని కలత చెందానని, ఆ నేపథ్యంలోనే బడిపిల్లలకు ఉదయం పూట అల్పాహార పథకాన్ని తొలివిడతగా కార్పొరేషన్, మునిసిపాలిటీ నగరాల్లో ప్రారంభించామన్నారు. రోజూ ఉద్యోగం, చదువుల కోసం వెళుతున్న మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించానని, మహిళలు ఉన్నత చదువులు వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డుగా నిలిచాయని తెలుసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్, ప్లస్-2 చదివిన విద్యార్థినులకు ఉన్నతవిద్య చదివే నిమిత్తం ప్రతినెలా రూ.1000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ‘పుదుమై పెణ్’ పథకాన్ని అమలు చేశానన్నారు. వచ్చే సెప్టెంబర్ 15న గృహిణులకు ప్రతినెలా రూ.1000 చెల్లించే పథకాన్ని అమలు చేయనున్నామన్నారు.
బడిపిల్లల అల్పాహార పథకం అమలు చేయడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని తెలుసుకుని సంతసించానని, దీవతో రాష్ట్ర మంతటా పథకాన్ని విస్తరించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 17లక్షల మంది బాలబాలికలు ఉదయం పూట పస్తులు ఉండకుండా చదువుకోనున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చదివిన పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి ఆశయాలు, సిద్ధాంతాలను అమలు పరిచే దిశగా ద్రావిడ తరహా పాలనను చూసి ప్రత్యర్థులు ఓర్వేలేకపోతున్నారన్నారు. తమ ప్రభుత్వం అందరికీ సమానమైన విద్యను అందించాలని ఆశిస్తుంటే నీట్‌ను అమలు చేసి వైద్యులు కావాలనుకునే నిరుపేద విద్యార్థులు ఆశలకు గండి కొట్టారన్నారు. ప్రస్తుతం నూతన విద్యావిధానాన్ని బలవంతంగా రుద్ది, విద్యను సైతం నాశనం చేయడానికి ద్రో(ణా)హాచార్యులు బయలుదేరారన్నారు. అయితే బొటనవేలిని దక్షిణగా చెల్లించినదంతా పాతకాలమని, ప్రస్తుతం కరుణానిధి అడుగుజాడల్లో నడుపుతున్న ప్రభుత్వం ఏకలవ్యుల ప్రతిభను ఎలుగెత్తి చాటే కాలంగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.సెల్వరాజ్, శాసనసభ్యుడు వీపీ నాగై మాలి, రాష్ట్ర ఆదిద్రావిడుల సంస్థ అధ్యక్షుడడు మదివానన్, మత్స్యాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ఎన్.గౌతమన్, జిల్లా కలెక్టర్ జానీటామ్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
నేనెవరో తెలుసా?...
తిరుకువలై ప్రాథమిక పాఠశాలలో బడిపిల్లల అల్పాహార పథకాన్ని ప్రారంభించిన స్టాలిన్ చిన్నారులకు స్వయంగా వడ్డించారు. అనంతరం వారితో కూర్చుని అల్పాహారం తిన్నారు. ఆ సందర్భంగా తనకు ఇరువైపులా కూర్చున్న బాలబాలికలతో కబుర్లాడారు. తన పక్కన కూర్చున్న బాలుడిని పిలిచి ‘నీ పేరేంటి?’ అని అడిగారు. అందుకతను వెంటనే ‘హరి’ అని బదులివ్వగా, అతడి చేతలో ఉన్న వాచీని చూపి ‘టైమ్ చూడటం వచ్చా?’ అని ప్రశ్నించారు. అందుకతను ఆ గడియారం పనిచేయడం లేదని సిగ్గుపడుతూ ముసిముసినవ్వులు నవ్వాడు. మరో వైపు కూర్చున్న బాలిక పేరును అడిగినప్పుడు సుదర్శన అని బదులిచ్చింది. తాను మూడో తరగతి చదువుతున్నానని, రోజూ బడికి వస్తున్నానని పేర్కొంది. ఇరువురిని తొలుత స్వీట్ తినమని స్టాలిన్ చెప్పారు. ఆ తర్వాత ‘నేనెవరో తెలుసా?’ అని స్టాలిన్ బాలికను ప్రశ్నించారు. వెంటనే ఆ బాలిక ‘ఆ... తెలుసు... మీరు సీఎం’ అని నవ్వుతూ బదులిచ్చింది. ‘నా పేరేంటో తెలుసా?’ అని సీఎం ప్రశ్నించగా, ఇరువైపులా ఉన్న బాలుడు, బాలిక బిక్కమొహం వేశారు. ఆ వెంటనే తేరుకున్న బాలుడు ‘మీ పేరు స్టాలిన్ కదా!’ అంటూ సిగ్గుల మొగ్గయ్యాడు. దాంతో సీఎం ‘శెభాష్’ అంటూ ఆ బాలుడిని భుజం తట్టారు. ఆ తర్వాత ఆ చిన్నారులతో ముఖ్యమంత్రి పావుగంటకు పైగా కబుర్లాడుతూ వారితో కలిసి అల్పాహారం తిన్నారు.