Chief Minister: సీఎం ఆవేదన.. అన్నీ ఉన్నా.. అదొక్కటే కొరవడింది..

ABN , First Publish Date - 2023-08-06T09:13:04+05:30 IST

అధికారంలో ఉన్నామనే ఆలోచన లేకుండా కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు బహిరంగంగా ముష్టియుద్ధాలకు దిగుతుండడం, ఆ దృశ్యాలు

Chief Minister: సీఎం ఆవేదన.. అన్నీ ఉన్నా.. అదొక్కటే కొరవడింది..

- నేతల్లో ఐకమత్యమేదీ?

- జిల్లా నేతల సభలో స్టాలిన్‌ ఆవేదన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నామనే ఆలోచన లేకుండా కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు బహిరంగంగా ముష్టియుద్ధాలకు దిగుతుండడం, ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలువడుతుండడం తనకు తీవ్ర ఆవేదన కలిగిస్తోందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కార్యదర్శులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో చెన్నైలోని పార్టీకి చెందిన వివిధ జిల్లా శాఖల నాయకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, దామో అన్బరసన్‌, సిట్రరసు,, మాధవరం మూర్తి, ఇలయ అరుణా సహా 72 జిల్లా శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టాలిన్‌ ప్రసంగిస్తూ... వచ్చే లోక్‌సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని, రాష్ట్రంలోని 39 నియోజకవర్గాల్లోనూ డీఎంకే కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచితీరాల్సిన అవసరముందన్నారు.ఈవిషయాన్ని అందరూ గు ర్తుంచుకుని ఇప్పటి నుండే కృషి చేయాలని సూచించారు. పార్టీలో సాధారణ కార్యకర్తల నుంచి జిల్లా నేతల వరకూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, నిధుల కొరత కూడా లేదన్నారు. ఇలా అన్నీ వున్నా పార్టీలో ఐకమత్యం లేకపోవడం తనకెంతో ఆందోళన కలిగిస్తోందన్నారు. తెన్‌కాశిలో పాత్రికేయుల ఎదుటే పార్టీ జిల్లా కార్యదర్శి స్థానిక నేతలతో గొడవపడ్డారని తెలిపారు.

తనకు అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టీ వ్యవహారాలు ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయనే విషయం కూడా మరచిపోయి జిల్లా శాఖల నాయకులు ఇలా కొట్లాడుకోవటం భావ్యమేనా అని ప్రశ్నించారు. మంత్రి మస్తాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనూ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారని, వారిని సర్దిపుచ్చే ప్రయత్నంలో మీడియా ముందే మంత్రి బూతులకు దిగడం శోచనీయమన్నారు. తమ చేతుల్లో మైకు ఉందనే విషయాన్ని మంత్రులు గుర్తించకుండా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను బాహాటంగా మాట్లాడుకోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పార్టీ అందరికీ సొంతమని, అందరూ తమ భావాలను నిర్భయంగా వ్యక్తం చేసుకోవచ్చని, అయితే ఈ వ్యవహారాలను పార్టీ సీనియర్లకు లేదా అధిష్టానానికి ముందుగా తెలియజేయాల్సి ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ సీనియర్‌ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన నాయకులు, శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా శాఖ నాయకులు, యూనియన్‌ శాఖల నాయకులు అందరూ సమష్టిగా పార్టీకి, కూటమి అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుండే పాటుపడాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

nani5.jpg

Updated Date - 2023-08-06T09:13:04+05:30 IST