Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. అది పాదయాత్ర కాదు.. పాపపు యాత్ర

ABN , First Publish Date - 2023-07-30T07:21:25+05:30 IST

రామేశ్వరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రారంభించింది పాదయాత్ర కాదని, బీజేపీ పాలకులు చేసిన పాపవు యాత్ర అని డీఎంకే అధ్య

Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. అది పాదయాత్ర కాదు.. పాపపు యాత్ర

- అన్నామలై యాత్రపై స్టాలిన్‌ విసుర్లు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రామేశ్వరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రారంభించింది పాదయాత్ర కాదని, బీజేపీ పాలకులు చేసిన పాపవు యాత్ర అని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) విమర్శించారు. స్థానిక తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో శనివారం ఉదయం జరిగిన పార్టీ యుజవన విభాగం సమావేశంలో పాల్గొన్న స్టాలిన్‌ ప్రసంగిస్తూ... కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి కొత్త పథకాలు ప్రారంభించేందుకు రామేశ్వరానికి రాలేదని, పార్టీ పాదయాత్ర ప్రారంభించేందుకు వచ్చారన్నారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండకు, ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండకు క్షమాపణలు చెప్పుకునేందుకు చేపట్టిన యాత్ర మాత్రమేనని ధ్వజమెత్తారు. వందేళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉండేదో, ప్రస్తుతం డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్రంలో ఎలా రూపుదిద్దుకున్నదో ప్రజలందరూ ఆలోచించాలన్నారు. అన్నాదురై, కరుణానిధి(Annadurai, Karunanidhi0 ఆశీనులైన సీఎం పీఠంపై ఆశీనుడవుతానని తాను కలలో కూడా అనుకోలేదని, ఇదంతా పార్టీకి నిరంతరం చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన పదవిగానే భావిస్తున్నానని చెప్పారు. పేదలకు సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్న డీఎంకే(DMK) తరహా పాలన కేంద్రంలోనూ రావాలనే అందరూ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగానే ప్రతిపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ పేరుతో సమైక్య వేదికను రూపొందించుకున్నాయని తెలిపారు. ఈ సమైక్యతకు తాను ఉడుతాభక్తిగా చేసిన కృషిని చూసి ఓర్వలేకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ నాయకులు అదే పనిగా తనను, డీఎంకేని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.

nani1.jpg

డీఎంకే యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఉదయనిధికి మంత్రి పదవి సులువుగా దక్కలేదని, గత లోక్‌సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన చేసిన ప్రచారం వల్లే పార్టీ ఘనవిజయం సాధించిందన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఉదయనిధి ఒక ఇటుకను చేతపట్టుకుని చేసిన ప్రచారాన్ని ఇప్పటికే ఎవరూ మరచిపోలేని కితాబిచ్చారు. కేంద్రమంత్రి అమిత్‌షా రాష్ట్రమంత్రి సెంథిల్‌బాలాజి గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగినట్లు లేవని, స్థాయిని దిగజార్చుకుని విమర్శలు చేశారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ నాయకుల్లో, మంత్రుల్లో, ఎంపీల్లో ఎంతమంది నేరస్తులున్నారో, ఎందరు జైలు శిక్షను అనుభవించారో ఆ లెక్కలన్నింటినీ తాను చెప్పగలనన్నారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై ఉసిగొల్పడం సిగ్గుచేటైన విషయమని అమిత్‌షాకు తెలియదా అని స్టాలిన్‌ ప్రశ్నించారు. సెంథిల్‌బాలాజిపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, దోషిగా నిరూపించబడలేదన్న విషయం కూడా హోమంత్రిగా ఉన్న అమిత్‌షాకు తెలియకపోవడం శోచనీయమని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2023-07-30T07:21:25+05:30 IST