Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఎయిమ్స్‌కు రెండో ఇటుక కూడా పడలేదు
ABN , First Publish Date - 2023-06-16T07:54:08+05:30 IST
మదురైలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి 2015లో తొలి ఇటుక వేశారని, ఇప్పటివరకు రెండో ఇటుక పడలేదని కానీ, తాము కేవలం 15 నెలల్లో అత్యాధు
- 15 నెలల్లో ఆస్పత్రిని నిర్మించాం
- కలైంజర్ పేరు చిరస్మరణీయం
- వైద్య రంగంలో దేశానికే ఆదర్శం: స్టాలిన్
- గిండిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
- వేలూరులో 250 పడకలతో హాస్టల్
అడయార్(చెన్నై): మదురైలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి 2015లో తొలి ఇటుక వేశారని, ఇప్పటివరకు రెండో ఇటుక పడలేదని కానీ, తాము కేవలం 15 నెలల్లో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) వెల్లడించారు. గిండిలో రూ.240.54 కోట్లతో వెయ్యి పడకలతో నిర్మించిన కలైంజర్ శతవార్షిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఈఆస్పత్రికి 2022 మార్చి 21న శంకుస్థాపన చేసి, రికార్డు స్థాయిలో 15 నెలల్లో నిర్మాణం పూర్తి చేశామన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రజా పనుల శాఖామంత్రి ఏవీ వేలు, రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం(M. Subramaniam) సమష్టి కృషేనన్నారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు మంత్రులతో పాటు ఆ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను ఆయన అభినందించారు. ఈ ఆస్పత్రిలో వెయ్యి పడకలు, పది ఆపరేషన్ థియేటర్లు, కేథలిక్ ల్యాబ్, యాంజియోగ్రామ్ విభాగం, అనస్థీసియాతో 15 విభాగాలు, సీటీ, ఎంఆర్‌ఐ, యూఎ్‌సజీ, డిజిటల్ ఎక్స్‌రే వంటి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు, పది లిఫ్టులు, రోగుల సహాయకులు ఉండేందుకు విశ్రాంతి గదులు, క్యాంటీన్లు... ఇలా సకల సదుపాయాలున్నాయన్నారు. రూ.146.52 కోట్లతో వైద్య పరికరాలను అమర్చినట్టు తెలిపారు. ఇలా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్న ఈ ఆస్పత్రిని రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉందని, కానీ, కొందరి ఒత్తిడి మేరకు ఆమె ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలైంజర్ జీవించి వున్నపుడు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైందన్నారు. కలైంజర్ రాసిన ‘నెంజుక్కు నీతి’ పుస్తకాన్ని అప్పటి అప్పటి రాష్ట్రపతి ఆవిష్కరించాల్సి ఉందన్నారు. కానీ, అపుడు కేంద్రంలో ఉన్న కొన్ని శక్తులు ఆయన్ను ఆ పుస్తకావిష్కరణకు రాకుండా అడ్డుకున్నాయని గుర్తు చేశారు. కరుణ జీవించివున్నంత వరకు పేదల కోసం అహర్నిశలు పాటుపడ్డారన్నారు. కలైంజర్ చూపిన మార్గంలో, ఆయన ఇచ్చిన ధైర్యసాహసాలతో మనమంతా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అందించే వైద్య సేవల ద్వారా మరికొన్ని వందేళ్ళు కలైంజర్ పేరు స్థిరస్థాయిగా ఉంటుందన్నారు. త్వరలోనే మదురైలో కలైంజర్ పేరుమీద నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. వేలూరులో వైద్య సేవలకు కోసం వచ్చే రోగులు బస చేసేందుకు 250 పడకలతో హాస్టల్‌ను తిరుముగై అనే గ్రామంలో నిర్మిస్తామన్నారు. దేశంలోనే అత్యధిక వైద్య కాలేజీలతో పాటు వైద్య సీట్లు కలిగిన రాష్ట్రంగా తమిళనాడు ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక్కో వైద్య కాలేజీ కావాలన్న ఆలోచన చేసిన నేత కలైంజర్ అని గుర్తు చేశారు. జయలలిత(Jayalalithaa) సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలను కలైంజర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగించారని గుర్తు చేశారు. అలాగే, తమ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తుందన్నారు. మక్కలై తేడి మరుత్తువం పథకం ద్వారా 1.46 కోట్ల మంది లబ్ధి పొందారన్నారు. 108 అంబులెన్స్ సేవలు ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్, ఏవీ వేలు, ఎం.సుబ్రహ్మణ్యం, పార్టీ ఎంపీ టీఆర్.బాలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆరోగ్య శాఖ కార్యదర్శి గగన్‌దీప్ సింగ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.