Chief Minister: ఐదు విదేశీ కంపెనీలకు అనుమతి
ABN , First Publish Date - 2023-05-03T07:46:32+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్రోనాస్, క్యాటర్‌పిల్లర్ సహా ఐదు విదేశీ కంపెనీలకు అనుమతిని జారీ చేయాలని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్రోనాస్, క్యాటర్‌పిల్లర్ సహా ఐదు విదేశీ కంపెనీలకు అనుమతిని జారీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన పథకాలు అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. వచ్చే యేడాది నిర్వహించినున్న అంతర్జాతీయ పెట్టుబడి దారుల సదస్సు నిర్వహణ, విదేశీ పెట్టుబడుల సేకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో స్టాలిన్ చర్చించారు. విదేశీ పెట్టుబడులను సేకరించేందుకు సీఎం సహా పలువురు మంత్రులు జరుపతలపెట్టిన విదేశీ పర్యటనలు గురించి సమీక్షించారు. విదేశాల్లో ఏయే సంస్థలతో, ప్రతినిధులతో చర్చలు జరపాలన్ని అంశంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5నుండి యేడాదిపాటు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకల నిర్వహణపై మంత్రివర్గ సహచరులతో చర్చించారు. అంతే కాకుండా జూన్ 5న చెన్నైలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. ముప్పావు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఇరవై నిమిషాలపాటు స్టాలిన్ మంత్రులతో సమావేశమై కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్, పీటీఆర్ పళనివేల్‌రాజన్, ఐ.పెరియసామి, ఇ.వి. వేలు, సాత్తూరు రామచంద్రన్, కే.ఎన్.నెహ్రూ, పొన్ముడి, పీ.కే.శేఖర్‌బాబు, ఎంఆర్కే పన్నీర్‌సెల్వం, తంగం తెన్నరసు, రఘుపతి, ఎం.సుబ్రమణ్యం, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, అనితా రాధాకృష్ణన్, వి.సామినాథన్, ఉదయనిధి స్టాలిన్, సెంథిల్ బాలాజీ, ఆవడి నాజర్, గీతా జీవన్, కయల్‌విళి, శివశంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు పాల్గొన్నారు.