Share News

Chief Minister: మధ్యతరగతి అపార్టుమెంట్ల వారికో గుడ్‏న్యూస్.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గింపు

ABN , First Publish Date - 2023-10-19T11:19:29+05:30 IST

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, నగరాలు వాటి సబర్బన్‌ ప్రాంతాల్లో మధ్య తరగతి అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నవారికి విద్యుత్‌

Chief Minister: మధ్యతరగతి అపార్టుమెంట్ల వారికో గుడ్‏న్యూస్.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గింపు

- సీఎం స్టాలిన్‌ ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, నగరాలు వాటి సబర్బన్‌ ప్రాంతాల్లో మధ్య తరగతి అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నవారికి విద్యుత్‌ ఛార్జీని తగ్గించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. ‘క్షేత్రపరిశీలనలో ముఖ్యమంత్రి’ పేరుతో వివిధ జిల్లాల్లో స్టాలిన్‌ పర్యటిస్తూ జిల్లా కలెక్టర్లతో, అధికారులతో సమావేశమై అభివృద్ధి పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంగళవారం సాయంత్రం కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై(Kanchipuram, Chengalpattu, Tiruvallur, Chennai) జిల్లాల్లో అభివృద్ధి పథకాల అమలుపై కలెక్టర్లు, పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలిరోజు సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి అర్హులకు అందేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదే విధంగా బుధవారం ఉదయం రెండో రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రహదారులు, వంతెన నిర్మాణాలను నిర్ణీత గడవులోపున పూర్తి చేయాలని, నిరుపేదలకు, మహిళలకు, విద్యార్థులకు అమలు చేస్తున్న పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరించి శాంతి భద్రతలను పరిరక్షించాలని, హింసాత్మక సంఘటలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇక మహిళలకు అమలు చేస్తున్న కలైంజర్‌ మహిళా సాధికారిక నగదు పంపిణీ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితాలు కుగ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు కూడా అందాలన్నారు.

nani6.2.jpg

నావలూరు టోల్‌గేట్‌ వసూలు రద్దు...

ఈ సమావేశంలో నాలుగు జిల్లాలవారికి సంబంధించి ఓ కీలకమైన ప్రకటన చేయనున్నామని తెలిపిన స్టాలిన్‌... సౌత్‌ చెన్నై నగరవాసుల చిరకాల కోరిక మేరకు నావటూరు టోల్‌గేట్‌ వద్ద వాహనాల రుసుములను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వు తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఇక గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రంలోని నగరాలు, వాటికి చేరువగా ఉన్న సబర్బన్‌ ప్రాంతాల్లో మధ్య తరగతి ప్లాట్లలో నివసిస్తున్న వారికి ఊరట కలిగించేలా మరో ప్రకటన చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఆ ప్రకారం మూడంతస్థులకు తక్కువ కాకుండా పది ప్లాట్లు కలిగి, లిఫ్ట్‌ సదుపాయం లేని భవన సముదాయాల నుంచి వసూలు చేస్తున్న విద్యుత్‌ ఛార్జీని తగ్గించనున్నామని తెలిపారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ఈ భవన సముదాయాలకు యూనిట్‌కు రూ.8 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇకపై యూనిట్‌కు రూ.5.50 మాత్రమే వసూలు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ విద్యుత్‌ ఛార్జీల తగ్గింపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, కేకే ఎస్‌ఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, దామో అన్బరసన్‌, ఆర్‌.గాంధీ, ఎం. సుబ్రమణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ ఆర్‌, రాహుల్‌నాధ్‌, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ కలైసెల్వి మోహన్‌, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రభు శంకర్‌, చెన్నై జిల్లా కలెక్టర్‌ రష్మీ సిద్దార్థ్‌ జాక్డే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

16,496 మందికి ఇంటిపట్టాలు...

ఈ సమీక్షా సమావేశంలో కాంచీపురం సహా మూడు జిల్లాలకు చెందిన 16,496 మందికి స్టాలిన్‌ ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. చెంగల్పట్టు జిల్లాలో 8136 మందికి, కాంచీపురం జిల్లాలో 3949, తిరువళ్లూరు జిల్లాలో 4411 మందికి ఆయన పట్టాలను అందజేశారు.

Updated Date - 2023-10-19T11:19:29+05:30 IST