Chief Minister: చమురు తెట్టు బాధితులకు రూ.7,500 నష్టపరిహారం
ABN , Publish Date - Dec 24 , 2023 | 08:51 AM
ఉత్తర చెన్నైలో చమురు తెట్టు పేరుకుపోయిన ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు తలా రూ.7,500 ఆర్థికసాయం అందజేసేలా రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.8.68 కోట్ల నిధులను
- రూ.8.68 కోట్ల విడుదల
- సీఎం స్టాలిన్ ప్రకటన
ప్యారీస్(చెన్నై): ఉత్తర చెన్నైలో చమురు తెట్టు పేరుకుపోయిన ప్రాంతాల్లో నష్టపోయిన బాధితులకు తలా రూ.7,500 ఆర్థికసాయం అందజేసేలా రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.8.68 కోట్ల నిధులను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా ఎన్నూర్ సముద్రతీర ముఖద్వారం ప్రాంతంలో పేరుకుపోయిన చమురు తెట్టు కారణంగా మత్స్యకారులు, పలు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. చమురు తెట్టు ప్రాంతాలను పలువురు మంత్రులు పరిశీలించిన అనంతరం అఽధికారులు బాధితుల వివరాలను సేకరించి రాష్ట్రప్రభుత్వానికి సమర్పించారు. ఎన్నూర్, పరిసర ప్రాంతాలైన కాట్టుకుప్పం, శివన్‌పడై కుప్పం, ఎన్నూర్‌కుప్పం, ముఖద్వార కుప్పం, తాళంకుప్పం, నెట్టుకుప్పం, వావూసీ నగర్, ఉలగనాఽథపురం, సత్యవాణిముత్తు తదితర సముద్రతీర ప్రాంతాల్లో నిలిపిన జాలర్ల పడవలు, వలలు... చమురు తెట్టు పేరుకుపోవడంతో నష్టం వాటిల్లింది. కోట్లాది రూపాయల వేట సామగ్రి కోల్పోయిన జాలర్లు తమ జీవనోపాధికి దారి చూపాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.ఈనేపథ్యంలో, ముఖ్యమంత్రి స్టాలిన్... 9,001 మంది చమురు తెట్టు బాధితులకు తలా రూ.7.500 సాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సాయం సరిపోదంటూ బాధితులు ఏకరువు పెట్టుకున్న నేపథ్యంలో, నష్టపోయిన పడవలకు తలా రూ.12,500 చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు.