Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-03-08T07:58:21+05:30 IST

రాష్ట్రంలో మతాల వారీగా, కులాల వారీగా ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు, ప్రత్యేకించి మతతత్వ వాదులు కుట్ర

Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మతాల వారీగా, కులాల వారీగా ఘర్షణలు రేపి, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్యర్థులు, ప్రత్యేకించి మతతత్వ వాదులు కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) సంచలన ఆరోపణలు చేశారు. ద్రావిడ మోడల్‌ పరిపాలనను అందిస్తున్న తమ ప్రభుత్వంలో ఎలాంటి లోపాల్లేకపోవడంతో ప్రత్యర్థులు ఈ పనికి పూనుకున్నట్లు ఆరోపించారు. మంగళవారం ఉదయం నాగర్‌కోవిల్‌లోని డీఎంకే కార్యాలయం వద్ద ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత కరుణానిధి(Karunanidhi) కాంస్య విగ్రహాన్ని స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ ... డీఎంకే అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటిందని, రెండేళ్లు కూడా పూర్తికాకముందే ఎన్నికల హామీల్లో 80 శాతాన్ని నెరవేర్చామన్నారు. తమ పాలన తీరును చూసి స్వదేశంలోని తమిళులే కాక, విదేశాల్లోని తమిళులు కూడా మనసారా మెచ్చుకుంటున్నారని చెప్పారు. నాగర్‌కోవిల్‌ పార్టీ ప్రాంగణం వద్ద తన తండ్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి(Karunanidhi) విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని, ఆయన చూపిన మార్గంలోనే మతతత్త్వ శక్తులపై పోరాడుతున్నానని తెలిపారు. అదే సమయంలో దేశాన్ని కులం పేరుతో, మతం పేరుతో ముక్కలు చేయాలని కుట్రపన్నుతున్న ప్రత్యర్థులు ద్రావిడ తరహా పాలన కొనసాగితే తమ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న భయంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకు వ్యూహం రచిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలనపై తనపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు సమాధానాలిచ్చి తన విలువైన సమయాన్ని వృథా చేయదలచుకోలేదని, ఆ విమర్శలకు తన మంత్రి వర్గ సహచరులు, పార్టీ సీనియర్‌ నేతల ద్వారా తగిన సమాధానాలు ఇస్తున్నానని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా డీఎంకే(DMK) ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించిందన్నారు. శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే(AIADMK)ని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చామన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రను సమర్థవంతంగా తిప్పికొడతామని స్టాలిన్‌ తెలిపారు. ఈ సభలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, కేకేఎస్ఎస్ ఆర్‌ రామచంద్రన్‌ మనోతంగరాజన్‌, పార్టీ జిల్లా శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-08T07:58:21+05:30 IST