Chief Minister: ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-06-21T07:55:58+05:30 IST
కేంద్రంలో బీజేపీకి మళ్లీ అధికారమిస్తే దేశంతో పాటు రాష్ట్రానికీ ముప్పు వాటిల్లుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)
అడయార్(చెన్నై): కేంద్రంలో బీజేపీకి మళ్లీ అధికారమిస్తే దేశంతో పాటు రాష్ట్రానికీ ముప్పు వాటిల్లుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ పాలకులు గత పదేళ్ళుగా సాగిస్తున్న నియంతృత్వ పోకడల్ని అణిచివేయాల్సిన బాధ్యత, కర్తవ్యం మనకందరికీ ఉందన్నారు. మళ్ళీ బీజేపీకి పట్టం కడితే తమిళానికి, తమిళుడికి, తమిళనాడుకు, దేశానికి, దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని సీఎం పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన స్మారకార్థం తిరువారూర్‌లో రూ.12 కోట్లతో, 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ‘కలైంజర్ కోట్టం’ను స్టాలిన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి ప్రసాద్ యాదవ్‌తో కలిసి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో నిర్మించిన కలైంజర్ విగ్రహం, ముత్తువేలర్ గ్రంథాలయం, కరుణానిధిని జ్ఞప్తికి తెచ్చేలా పాత ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్, రెండు కళ్యాణ మండపాలను ఈ సందర్భంగా స్టాలిన్ తన సహచరులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కలైంజర్‌ను దేశం మెచ్చిన నేతను చేసిన గడ్డ ఈ తిరువారూర్ నేల అని పేర్కొన్నారు. పాఠశాల విద్యాభ్యాసం కోసం ఇక్కడకు వచ్చిన తన తండ్రికి ఈ ఊరే... సర్వస్వంగా మారిపోయిందన్నారు. కుళిత్తలై, తంజావూరు, సైదాపేట, అన్నానగర్(Thanjavur, Saidapet, Annanagar), హార్బర్, చేపాక్కం వంటి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచినప్పటికీ.. తిరువారూరు నియోజకవర్గంలో మాత్రం ఒకటి కాదు రెండు సార్లు విజయాన్ని అందించిందని గుర్తుచేశారు. ఒక రథం బయలుదేరిన స్థానంకే వచ్చి చేరుతుందన్న నానుడిలా కరుణ ప్రయాణం కూడా సాగిందన్నారు. అందుకే ఇక్కడ కలైంజర్ కోట్టం నిర్మించామన్నారు. అయితే, ఈ కోట్టం అందాన్ని ఏమాత్రం చెక్కు చెదరకుండా రక్షించాల్సిన బాధ్యత ఈ నిర్వాహకులపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కలైంజర్ సారథ్యంలోని ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. ద్రావిడ మోడల్ పరిపాలనను ఆ మహానేతకు కానుకగా సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ఆ రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసే హక్కును కల్పించారన్నారు. అలాగే, 1971 నుంచి జరిగిన కీలక రాజకీయ మార్పులకు కరుణ మూలకారణంగా ఉన్నారన్నారు. ఇందిరా గాంధీ మొదలుకుని మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ వరకు ప్రతి ఒక్కరితోనూ మంచి స్నేహ సంబంధాలను కొనసాగించారన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఇంటికి దీపం వంటిదని, సర్వాధికారం అనేది కార్చిచ్చు వంటిందని కలైంజర్ చెప్పేవారని స్టాలిన్ గుర్తు చేశారు.