Chief Minister: వచ్చే ఆరు నెలలు మనకు చాలా కీలకం.. జాగ్రత్త
ABN , First Publish Date - 2023-09-27T07:57:55+05:30 IST
వరుసగా పండుగలు, ఆపై లోక్‌సభ ఎన్నికలు వస్తున్నందున వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకమైనవని, అందువల్ల పోలీసులు
- నిఘాను తీవ్రతరం చేయండి
- పోలీస్‌శాఖకు సీఎం ఆదేశం
- శాంతిభద్రతలపై సమీక్ష
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వరుసగా పండుగలు, ఆపై లోక్‌సభ ఎన్నికలు వస్తున్నందున వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకమైనవని, అందువల్ల పోలీసులు నిఘాను తీవ్రతరం చేయడంతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం స్టాలిన్(CM Stalin) ఆదేశించారు. మంగళవారం సచివాయలంలో రాష్ట్ర శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వచ్చే ఆరుమాసాల్లో జిల్లా స్థాయిలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేయాలని కోరారు. ఇక ఆ విభాగం అందించే సమాచారాన్ని ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. గత నెల రోజులుగా పత్రికలు తదితర ప్రసార మాధ్యమాల్లో రాష్ట్రంలో నేరాల సంఖ్య అధికమైనట్లు తప్పుడు వార్తలు వెలువడుతున్నాయని, వాస్తవానికి గతేడాది కంటే రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని స్టాలిన్ వివరించారు. తమ ప్రభుత్వం మహిళాభ్యుదయానికే అగ్రతాంబూలం ఇస్తోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను కూడా చేపడుతోందని చెబుతూ.. మహిళలు పెద్ద సంఖ్యలో గుమికూడే ప్రాంతాల వద్ద, చిన్నారులు అధికంగా సంచరించే ప్రాంతాల వద్ద పోలీసు నిఘాను పెంచాలన్నారు. ఇదే విధంగా చిన్నారులపై లైంగిక వేధింపులు జరగకుండా నిరోధించేందుకు మహిళా పోలీసులు కూడా గట్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. గత నాలుగు నెలలుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ పోలీసులు కలిసికట్టుగా చేపట్టిన చర్యల వల్ల సారా తయారీని నిరోధించగలిగినట్లు ఆయన ప్రశంసించారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు ముందంజలో ఉండేలా పోలీసు అధికారులంతా సమైక్యంగా పాటుపడాలని స్టాలిన్ పిలుపునిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి పి.అముదా, డీజీపీ శంకర్ జివాల్, గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనర్ సందీప్‌రాయ్ రాథోడ్, తాంబరం పోలీసు కమిషనర్ అమల్‌రాజ్, ఆవడి పోలీసు కమిషనర్ కె.శంకర్‌పాల్గొన్నారు.