Chief Minister: వచ్చే ఎన్నికల్లో భారత్ కూటమి విజయం తథ్యం
ABN , First Publish Date - 2023-11-01T09:18:00+05:30 IST
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాలకు స్వయంపరిపాలన కావాలంటూ ఘోషించిన మోదీ ప్రధానమంత్రి కాగానే
- సీఎం స్టాలిన్
అడయార్(చెన్నై): ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాలకు స్వయంపరిపాలన కావాలంటూ ఘోషించిన మోదీ ప్రధానమంత్రి కాగానే ఆ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రాలకు స్వయంపరిపాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో భారత్ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా అనే పేరుతో ఆయన మూడో విడత వీడియో ప్రసంగాన్ని మంగళవారం విడుదల చేశారు. డీఎంకే సిద్ధాంతాల్లో ముఖ్యమైనది రాష్ట్రాలకు స్వయం పరిపాలన అని గుర్తు చేశారు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాలకు స్వయంపాలన కావాలంటూ ఘోషించారని, కానీ, ఇపుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాల హక్కులన్నీ హరించేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఇపుడు రాష్ట్రాల హక్కులను హరించేలా ఆయన సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నడుచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య ఏర్పడే సమస్యలను సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకునేందుకు వీలుగా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మోదీ.. ఇపుడు ఆ కౌన్సిల్ ఊసెత్తడం లేదన్నారు. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని పదేపదే చెప్పిన ఆయన నిరంతరం బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టడంపైనే దృష్టిసారించారని సీఎం స్టాలిన్ విమర్శించారు.