Chief Minister: తీవ్ర కరువులో ఉన్నాం.. నిధులు మంజూరు చేయండి సార్.. కేంద్ర హోంమంత్రికి సీఎం వినతి
ABN , Publish Date - Dec 21 , 2023 | 01:09 PM
రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah)ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) విన్నవించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah)ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బుధవారం అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో కరువు పరిస్థితిని ఇప్పటికే నివేదిక రూపంలో సమర్పించామని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ చర్చలు జరిపిన విషయాన్ని వివరించారు. కేంద్ర కరువు అధ్యయన బృందాలు పరిశీలించాయని, రాష్ట్రంలోని 236 తాలూకాల్లో ఏకంగా 223 తాలూకాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు తాండవిస్తోందని, తాగునీటికి సమస్య నెలకొందని, ఉపాధిపనులు, పశుగ్రాసం కూడా క్లిష్టంగా మారిందని తెలిపారు. 48.19 లక్షల హెక్టార్లలో పంటనష్టం వాటిలినట్లు వివరించారు. జాతీయ విపత్తుల నిధి కింద రూ.18,177.44 కోట్ల గ్రాంటు విడుదల చేయాలని కోరారు. ఇందులో రూ.4,663.11 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.12,577.86 కోట్లు అత్యవసర పరిహారం, రూ.566.78 కోట్లు తాగునీటికి, రూ.363.68 కోట్లు పశుగ్రాసం, పశుసంపద రక్షణకు విడుదల చేయాలని విన్నవించారు. పరిహారం కోసం నవంబరు 22న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సమర్పించామని తెలిపారు. నివేదికలు పంపి దాదాపు మూడునెలలు పూర్తవుతోందని, వెంటనే కరువు సాయం అందించి క్లిష్టపరిస్థితిలో ఉండే రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కృష్ణభైరేగౌడతో పాటు రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు ఎల్. హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ ఉన్నారు. కేంద్రహోంమంత్రిని సంప్రదాయ మైసూరు పాగాతో సీఎం బృందం సత్కరించింది.