Chief Minister: కష్టాల్లో ఉన్నాం... కావేరి నీరివ్వలేం.. అర్ధం చేసుకోండి...

ABN , First Publish Date - 2023-09-15T09:54:24+05:30 IST

కావేరి బేసిన్‌ ప్రాంతంలోని రైతులు నదీనీటిపైనే అధికంగా ఆధారపడి ఉన్నారని కష్టాల్లో ఉన్న కారణంగా తమిళనాడుకు నీటిని విడుదల చేసే

Chief Minister: కష్టాల్లో ఉన్నాం... కావేరి నీరివ్వలేం.. అర్ధం చేసుకోండి...

- కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి సీఎం లేఖ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి బేసిన్‌ ప్రాంతంలోని రైతులు నదీనీటిపైనే అధికంగా ఆధారపడి ఉన్నారని కష్టాల్లో ఉన్న కారణంగా తమిళనాడుకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌కు గురువారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ఈలేఖలో పలు గణాంక వివరాలను ప్రస్తావించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు 92 రోజుల పాటు తమిళనాడు కావేరి బేసిన్‌లో 100 టీఎంసీ నీటిని వాడుకుందన్నారు. 1987-88, 2002-03, 2012-13, 2016-17, 2017-18 కరువు కాలంలో తమిళనాడు వాడుకున్న నీటి ప్రమాణం కంటే ఇది అధికమని లేఖలో సీఎం ప్రస్తావించారు. కరువు పరిస్ధితి నెలకొని ఉన్నా సరిహద్దులో తమిళనాడులో విరివిగా వరి పంట వేశారని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 12 నుంచి 24 వరకు ఐఎండీ వాతావరణ శాఖ సూచన మేరకు వర్షాలు కురిసే పరిస్థితి కనిపించడం లేదని సీఎం తెలిపారు.

మెట్టూరు రిజర్వాయర్‌లో సెప్టెంబరు 12న 24.233 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని కావేరి నిర్వహణా ప్రాథికార ఆదేశాల మేరకు తమిళనాడుకు విడుదల చేసిన నీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ రాష్ట్రంలో రైతుల పంటలకు సరిపడా నీరు ఉన్నాయని అయినా తమిళనాడు కావేరీ పేచీ లేవనెత్తుతోందని లేఖలో సీఎం వెల్లడించారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న నీటిపారుదల శాఖా మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) కూడా ఇదే విధమైన సూచన చేశారు. వర్షాభావ పరిస్థితి కారణంగా రాష్ట్రంలో ఒక పక్క కరువు ఛాయలు నెలకొని ఉన్నాయని మరో పక్క కావేరి బేసిన్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున తమిళనాడుకు బిడిగుండ్లు నుంచి ప్రతిరోజూ 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం అసాధ్యమని కేంద్రమంత్రికి వివరించారు. కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

Updated Date - 2023-09-15T09:54:24+05:30 IST