Chief Minister: మాకు మొత్తం రూ.12,659 కోట్ల సాయం అవసరం..
ABN , Publish Date - Dec 15 , 2023 | 11:50 AM
‘మిచౌంగ్’ తుఫాను తాకిడికి గురైన నాలుగు జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన వరదబాధితులు, వ్యాపారులు, మత్స్యకారులు,
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘మిచౌంగ్’ తుఫాను తాకిడికి గురైన నాలుగు జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన వరదబాధితులు, వ్యాపారులు, మత్స్యకారులు, చిన్న, కుటీర, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12659 కోట్ల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) కేంద్ర పరిశీలక బృందానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు గుణాల్ సత్యార్థి నేతృత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు ఏకే శివశ్రీ, భవ్యపాండే, ఆర్థికశాఖ అధికారి రంగనాథ్ ఆడమ్, విద్యుత్‌శాఖాధికారి విజయకుమార్, రహదారులు రవాణా శాఖ అధికారి తీమాన్‌సింగ్ సభ్యులుగా ఉన్న కేంద్ర పరిశీలక బృందం రెండు జట్లుగా ఏర్పడి తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు పర్యటించింది. గురువారం ఉదయం రిప్పన్‌భవనంలో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్‌ను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఆ తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. కేంద్ర పరిశీలక బృందం సభ్యులతోపాటు రెవెన్యూశాఖ మంత్రి రామచంద్రన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా తదితరులు పాల్గొన్నారు.
స్టాలిన్ మాట్లాడుతూ... తుఫాను తాకిడికి గురై దెబ్బతిన్న రహదారులు, ఫ్లైఓవర్లు, పాఠశాల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను తక్షణమే మరమ్మతు చేయడానికి, వరద బాధిత ప్రాంతాల్లో చెడిన ట్రాన్స్‌ఫార్మర్‌లు, కూలిపడిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న సబ్‌స్టేషన్లను మరమ్మతు చేయడం వంటి పనులకు తక్షణ సాయంగా రూ.7033 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. ఇదే విధంగా స్థానిక సంస్థలలో దెబ్బతిన్న తాగునీటి ట్యాంకులు, గ్రామీణ రహదారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రభవనాలు, జిల్లా ఆసుపత్రుల భవనాలు, జాలర్లకు సంబంధించిన పడవలు, వలలు మరమ్మతు చేయడానికి, చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలకు జరిగిన నష్టాలన్ని భర్తీ చేయడానికి, ప్లాట్‌ఫామ్‌లోని వ్యాపారులను ఆదుకోవడానికి ఈ నిధులు చాలా అవసరమవుతోందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన గుణాల్ సత్యార్థి విలేఖరులతో మాట్లాడుతూ... వాతావరణశాఖ తుఫానుకు సంబంధించి జారీ చేసిన హెచ్చరికలతో చెంబరంబాక్కం జలాశయం నుంచి జలాలను ముందుగానే విడుదల చేయడం వల్ల పెనుముప్పు తప్పిందని, అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం భారీ స్థాయిలో జరుగలేదని ప్రశంసించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలను సేకరించామని, త్వరలో నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని చెప్పారు.