Chief Minister: వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చుతాం..

ABN , First Publish Date - 2023-05-10T09:32:45+05:30 IST

మణిపూర్‌లో గత వారం రోజులుగా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తమిళులను క్షేమంగా స్వస్థలాలకు

Chief Minister: వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చుతాం..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మణిపూర్‌లో గత వారం రోజులుగా ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తమిళులను క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మంగళవారం మధ్యా హ్నం ప్రకటన జారీ చేశారు. మణిపూర్‌లోని కళాశాలల్లో వైద్యం తదితర కోర్సులు చదువుతున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు ఈ నెల 5న తాను విదేశీ తమిళుల సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మణిపూర్‌(Manipur)లోని తమిళ సంఘాల నాయకులను సంప్రదించి ఇబ్బందుల్లో ఉన్న తమిళులందరికీ వైద్య, ఆర్థిక సాయం అందించాలని కోరానని తెలిపారు. వైద్యకోర్సులు చదివే తమిళ విద్యార్థులు హాస్టళ్లలో క్షేమంగా ఉన్నారని, పరీక్షలకు సిద్ధమవుతున్నారని తనకు సమాచారం కూడా అందిందని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన విరుదునగర్‌, తూత్తుకుడి, తిరువళ్లూరు, కడలూరు(Virudhunagar, Thoothukudi, Tiruvallur, Cuddalore) జిల్లాలకు చెందిన ఐదుగురు విద్యార్థులను విమానంలో తరలించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఆ ఐదుగురు విద్యార్థులకు విమాన ఛార్జీలు కూడా చెల్లించామని, వారంతా మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకుంటారని తెలిపారు.

Updated Date - 2023-05-10T09:32:45+05:30 IST