Chief Minister: నా సతీమణి ఆలయాలకు వెళ్తే తప్పేంటి?
ABN , First Publish Date - 2023-10-22T11:33:49+05:30 IST
డీఎంకే ఎన్నడూ ఆధ్యాత్మికానికి వ్యతిరేకం కాదని, ఆలయాలకు వెళ్లడం, భక్తిని కలిగి ఉండటం ప్రజల అభిమతమని, ఈ విషయంలో
- ఆధ్యాత్మికానికి మేం వ్యతిరేకం కాదు
- దుష్ప్రచారం చేయడమే బీజేపీ పని
- డీఎంకే ఐటీ విభాగ సభలో స్టాలిన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే ఎన్నడూ ఆధ్యాత్మికానికి వ్యతిరేకం కాదని, ఆలయాలకు వెళ్లడం, భక్తిని కలిగి ఉండటం ప్రజల అభిమతమని, ఈ విషయంలో తామెన్నడూ జోక్యం చేసుకోలేదని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) అన్నారు. చెన్నై షెనాయ్‌నాగర్‌లో డీఎంకే ఐటీ విభాగం నిపుణుల సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలు సాగించి ఆలయాల్లో ఆరాధన హక్కులను సాధించిన ఘనత డీఎంకేకు చెల్లుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు డీఎంకేపై పనిగట్టుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తన సతీమణి దుర్గా ఆలయాలకు వెళితే చాలు వెంటనే ఫొటోలు తీసి ‘ఇదిగో చూడండి స్టాలిన్ భార్య గుడికెళ్లింది’ అంటూ సామాజిక ప్రసార మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని వాపోయారు. దుర్గా ఎన్నో గుళ్ళకు వెళ్తున్నారని, ఆ విషయంలో తానెన్నడూ అడ్డు చెప్పలేదని, ఆమె గుళ్లకు వెళితే తప్పేంటని ప్రశ్నించారు. భక్తి అనేది వ్యక్తిగతమైనదన్నారు. ‘పరాశక్తి’ చిత్రంలో కరుణానిధి సంభాషణలలో ‘ఆలయాలు వద్దనేది మా అభిమతం కాదు.... ఆలయాలు దుష్టుల ఆవాసంగా మారకూడదు’ అనే డైలాగ్ ఉంటుందని, దారి ఆధారంగానే ప్రజలకు ద్రవిడ తరహా పాలనను అందిస్తున్నామని స్టాలిన్ చెప్పారు. సామాజిక న్యాయం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా పోరాడటమే డీఎంకే కర్తవ్యమన్నారు. ప్రస్తుతం సామాజిక ప్రసార మాధ్యమాల్లో గోబెల్స్ ప్రచారాలే ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో డీఎంకే ఐటీ విభాగం నిర్వాహకులందరూ ఎప్పటికప్పుడు పార్టీపై వచ్చే విమర్శలు, తప్పుడు సమాచారం, ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పెరియార్, అన్నాదురై కాలంలో ఇంతటి ప్రసారమాధ్యమాలు లేవని, పెరియార్ తనకున్న రాజకీయ ప్రత్యర్థుల పేర్లను కాగితాలలో రాసుకుని భద్రపరచుకునేవారని చెప్పారు. పెరియార్ రాజకీయ ప్రత్యర్థులను గౌరవించేవారని, పార్టీలకు సిద్ధాంతాపరంగానే వ్యతిరేకమే కాని, వ్యక్తిగతంగా తనకెవరూ విరోధులు లేరని కూడా చెప్పుకునేవారని స్టాలిన్ గుర్తు చేశారు.
భక్తిని దుర్వినియోగం చేస్తున్న బీజేపీ...
బీజేపీ పాలకులు ఆధ్యాత్మికాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, గుడిని, భక్తిని రాజకీయ అంశాలుగా మార్చుకుని మతపరమైన ఘర్షణలకు దోహదం చేస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చాక వెయ్యి ఆలయాలకు కుంభాభిషేకాలు నిర్వహించామని, వాస్తవం ఇలాఉండగా ఏక్కడో జరిగిన భూ కంప దృశ్యాలను వాట్స్‌పలలో వెలువరించి బీజేపీ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో ఆలయాలను ధ్వంసం చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.దీపం వెలిగితే దొంగకు నచ్చదని, రాష్ట్రంలోని ఆలయాలు కొత్త మెరుగులతో ఉంటే బీజేపీ నాయకులు నచ్చదని విమర్శించారు. సోషల్ మీడియాను సైతం బెదరించి వారికి అనుకూలమైన సమాచారాలనే ప్రసారం చేయిస్తున్న బీజేపీ ఓ సోషల్ వైర్‌సగా మారిందని, మీసా, టాడా వంటి కేసులకే బెదరని డీఎంకే ఈ కొత్త వైర్‌సకు ఎలా భయపడుతుందని ప్రశ్నించారు. బీజేపీ మతతత్వ ధోరణులను చూసి ఇక ఎన్డీయేలో ఉంటే పార్టీకి పుట్టగతులు ఉండవనే అన్నాడీఎంకే ఆ కూటమికి గుడ్‌బై చెప్పిందన్నారు. బీజేపీ, అన్నాడీఎంకేలు బొమ్మా, బొరుసూ లేని నాణెం అని ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మరిన్ని దుష్ప్రచారాలు సాగిస్తుందని, వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత డీఎంకే ఐటీ నిపుణుల విభాగానిదేనని దిశా నిర్దేశం చేశారు.