Chief Minister's warning: ఆ దాడులన్నీ నకిలీవే.. వారిపై కఠిన చర్యలుంటాయి

ABN , First Publish Date - 2023-03-05T09:11:08+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సేవారంగాల్లో, భవన నిర్మాణరంగంలో సేవలందిస్తున్న బిహార్‌, జార్ఖండ్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ

Chief Minister's warning: ఆ దాడులన్నీ నకిలీవే.. వారిపై కఠిన చర్యలుంటాయి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సేవారంగాల్లో, భవన నిర్మాణరంగంలో సేవలందిస్తున్న బిహార్‌, జార్ఖండ్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన జారీ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చెన్నైకి ఉపాధి కోసం, వ్యాపారాల కోసం వచ్చే రాష్ట్రేతరుల పట్ల అతిథి భావనతోనే రాష్ట్ర ప్రజలు మెలగుతున్నారని, ఇన్నేళ్లుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు సంపూర్ణ భద్రతతో జీవించారన్నారు. రాష్ట్రంలో పనిచేస్తే ఇతరులపై ఎన్నడూ తమిళులు దాడులకు పాల్పడలేదన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్రేతర కార్మికుల శ్రమ కూడా ఉందంటూ తను పలుమార్లు ప్రశంసించానని గుర్తుచేశారు. వ్యాపారాల కోసం, ఉన్నత విద్య కోసం, ఉపాధి కోసం, వైద్య చికిత్సల కోసం తరలివస్తున్న రాష్ట్రేతరులంతా ప్రశాంతంగానే గడిపి తిరిగి వెళుతున్నారని, కొందరు స్థిర నివాసం కూడా ఏర్పరచుకుని తమిళులతో సన్నిహితంగా మెలగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్మిక భద్రత చట్టం ప్రకారం వారికి తమ ప్రభుత్వం అన్ని హక్కులు కల్పించిందన్నారు. వీటన్నిటికి తోడు కరోనా రెండో దశ వ్యాప్తి సమయంలో రాష్ట్రంలోని ఉత్తరాది కార్మికులందరినీ కార్పొరేషన్‌, పురపాలక సంఘాలు, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సురక్షితంగా స్వస్థలాలకు రైళ్లలో తరలించిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తు చేశారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకూ రాష్ట్రేతర కార్మికులందరికీ ప్రమాద నష్టపరిహారంగా రూ.6.27 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉండగా... రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు బిహార్‌కు చెందిన పాత్రికేయుడొకరు వేరే రాష్ట్రంలో జరిగిన సంఘటనను తమిళనాట జరిగినట్లు వదంతి పుట్టించారన్నారు. ఈ విషయాన్ని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‏కుమార్‌(Bihar Chief Minister Nitish Kumar)కు ఫోన్‌ చేసి తెలిపానని, ఆ రాష్ర్టానికి చెందిన కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని వివరించానని పేర్కొన్నారు. బిహార్‌ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులంతా తమ రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారని తాను చెప్పగానే ఆయన సంతృప్తి చెందారని స్టాలిన్‌ ఆ ప్రకటనలో ఉటంకించారు.

నలుగురిపై కేసు నమోదు...

ఇదిలా వుండగా రాష్ట్రేతర కార్మికులపై దాడులు జరిగినట్లు పాత వీడియోలతో వదంతులు పుట్టించారనే ఆరోపణలపై నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిహార్‌కు చెందిన యూట్యూబర్‌, హిందీ ఆన్‌లైన్‌ పత్రికకు చెందిన ఒకరు, ఓ న్యాయవాది సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా ఆ వీడియోలను కృష్ణగిరి, తూత్తుకుడి జిల్లాల్లో ప్రసారం చేసిన మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు.

ఏడేళ్ల జైలు శిక్ష

రాష్ట్రేతరులపై దాడులు జరిగినట్లు వదంతులు పుట్టించేవారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని డీజీపీ శైలేంద్రబాబు హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాది కార్మికులపై ఎవరైనా దాడికి పాల్పడినట్లు తెలిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఓర్వలేకే...

ముఖ్యమంత్రి స్టాలిన్‌ జన్మదిన వేడుకల్లో బిహార్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నాయకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు పథకం ప్రకారం వదంతులు సృష్టించి ఉత్తరాదిన జరిగిన ఘర్షణలకు సంబంధించిన పాత వీడియోలను అప్‌లోడ్‌ చేసి రాష్ట్రంలో అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. వదంతులను ఎవరూ నమ్మకూడదని ఆయన పిలుపునిచ్చారు.

భారీగా తరలిపోతున్న ఉత్తరాది యువకులు

ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ యంత్రాంగమంతా భరోసా ఇస్తున్నప్పటికీ బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన కూలీలు రాష్ట్రాన్ని వీడుతున్నారు. వదంతులు రేగుతున్న తరుణంలో కొంతకాలంగా ఇక్కడి నుంచి తరలివెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా తరలివెళ్లే వారితో శనివారం సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ కిటకిటలాడింది. మరోవైపు ఉత్తరాది యువకులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఎవరైనా దాడి చేస్తే తక్షణం తమకు సమాచారం అందించాలని, వెంటనే తాము ఆయా ప్రాంతాలకు చేరుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-03-05T09:11:08+05:30 IST