Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-12T09:45:16+05:30 IST
న్యాయమూర్తుల నియామకాల కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానం అత్యంత శక్తిమంతంగా, క్రియాశీలంగా ఉందని, అది తన కర్తవ్యానికి కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ చెప్పారు. ఇటీవల ఈ వ్యవస్థ సిఫారసు చేసిన 72 గంటల్లోనే ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరగడమే దీనికి నిదర్శనమని చెప్పారు.
న్యూఢిల్లీ : న్యాయమూర్తుల నియామకాల కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానం అత్యంత శక్తిమంతంగా, క్రియాశీలంగా ఉందని, అది తన కర్తవ్యానికి కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ (Dhananjaya Y Chandrachud) చెప్పారు. ఇటీవల ఈ వ్యవస్థ సిఫారసు చేసిన 72 గంటల్లోనే ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరగడమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ ఇద్దరు న్యాయమూర్తుల గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయవాదులు, న్యాయమూర్తులను ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (Supreme Court Bar Association -SCBA) ఈ ఇద్దరు న్యాయమూర్తులను అభినందిస్తూ ఓ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, కొలీజియం సిఫారసు చేసిన 72 గంటల్లోనే సుప్రీంకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ వ్యవస్థ శక్తిమంతంగా, క్రియాశీలంగా ఉందని, తన కర్తవ్యానికి కట్టుబడి, నిబద్ధతతో పని చేస్తోందని ఈ నియామకాలు దేశానికి ఓ సందేశాన్ని పంపించాయని చెప్పారు. ఇటీవలి నియామకాల ఘనత కేవలం కొలీజియం వ్యవస్థది మాత్రమే కాదని, ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియలో సమాన భాగస్వామి అని తెలిపారు.
‘‘ఈ ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి అని మనం తప్పనిసరిగా అంగీకరించాలి. పేర్లను సిఫారసు చేసిన 72 గంటల్లోగానే ఈ నియామకాలు జరిగాయి, దీని ద్వారా మనం దేశానికి ఓ సందేశాన్ని పంపించాం. అదేమిటంటే, ‘కొలీజియం శక్తిమంతంగా ఉంది, క్రియాశీలంగా ఉంది, తన కర్తవ్యానికి నిబద్ధతతో కట్టుబడి ఉంది’ అని మనం సందేశాన్ని పంపించాం’’ అని తెలిపారు.
కొలీజియం ద్వారా జరిగే అన్ని నియామకాలపైనా సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానానికి జరిగే ప్రతి నియామకం గౌరవాన్ని పొందుతోందని, న్యాయమూర్తుల అభిమానాన్ని సాధిస్తోందని వివరించారు.
కొలీజియం అంటే..
కొలీజియంకు సీజేఐ నేతృత్వం వహిస్తారు. సుప్రీంకోర్టులోని నలుగురు మోస్ట్ సీనియర్ జడ్జిలు సభ్యులుగా ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ మిశ్రాను, సీనియర్ అడ్వకేట్ విశ్వనాథన్‌ను కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిద్దరూ మే 19న న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
పెండింగ్‌లో మరో సిఫారసు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్టిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం జూలై 5న కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండాలి, ప్రస్తుతం 30 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
Governor: ఆ మంత్రి వ్యవహారంపై ఇప్పుడు ఏం చేద్దాం?