CM: సీఎం స్టాలిన్ ధ్వజం.. బీజేపీ నేతలా గవర్నర్ వ్యవహారం.. ఆ పార్టీ కార్యాలయంగా రాజ్‌భవన్
ABN , First Publish Date - 2023-10-31T10:51:05+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి బీజేపీ నేతలా వ్యవహరిస్తూ రాజ్‌భవన్‌ను ఆ పార్టీ కార్యాలయం గా మార్చారని ముఖ్యమంత్రి స్టాలిన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి బీజేపీ నేతలా వ్యవహరిస్తూ రాజ్‌భవన్‌ను ఆ పార్టీ కార్యాలయం గా మార్చారని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ధ్వజమెత్తారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ 116వ జయంతి వేడుకల సందర్భంగా రామనాథపురం జిల్లా పసుంపొన్‌లో ఆయన స్మారక స్థలం వద్ద సోమవారం ఉదయం మంత్రులతోపాటు నివాళి అర్పించారు. కార్యక్రమం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఆర్య విధానం, ద్రావిడ విధానం అంటూ ఏవీ లేవని రాష్ట్ర గవర్నర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘కొంతమందికి (అగ్రవర్ణాలకు) మాత్రమే అన్ని సదుపాయాలు’ అనేది ఆర్య విధానమని, ‘అందరికీ అన్ని సదుపాయాలు’ అనేది ద్రావిడ విధానమని, ఈ తారతమ్యాన్ని గవర్నర్ అర్థం చేసుకోవాలన్నారు. ఇక రాజ్‌భవన్‌పై పెట్రోలు దాడులు జరిగాయని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని, రాజ్‌భవన్ అధికారులు సైతం దుష్ప్రచారం చేస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. వాస్తవానికి రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలోనే బాంబుదాడి జరిగిందని, ఆ సంఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో దృశ్యాలను పోలీసులు విడుదల చేశారని చెప్పారు.
దేవర్ స్మారకస్థలం వద్ద 2 మండపాలు...
పసుంపొన్ ముత్తురామలింగదేవర్ స్మారక స్థలం వద్ద రాష్ట్ర ప్రభుత్వం రెండు మండపాలను నిర్మించనున్నదని స్టాలిన్ చెప్పారు. దేవర్ స్మారక స్థలం నిర్మాణంలో కీలపాత్ర పోషించి ఆయన శతజయంతి వేడుకలను ఘనంగా జరిపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికే దక్కుతుందని తెలిపారు. దేవర్ స్మారక స్థలం వద్ద ఆరని జ్యోతి ఏర్పాటు, దేవర్ ఇల్లమ్‌ను రూ.10లక్షలతో మరమ్మతులు చేసి, రూ.9లక్షలతో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించి, రూ.5లక్షల వ్యయంతో మండపం నిర్మించార ని చెప్పారు.
ఇక తానూ రూ.1.50 కోట్లతో దేవర్ స్మారక స్థలం వద్ద రెండు శాశ్వత మండపాలను నిర్మించడానికి ఉత్తర్వు జారీ చేశానని స్టాలిన్ తెలిపారు. మదురై విమానాశ్రయానికి పసుంపొన్ దేవర్ పేరు పెట్టాలని కేంద్రప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
జాలర్లను కేంద్రమే విడిపించాలి...
శ్రీలంక నావికాదళం నిర్బంధించిన తమిళ జాలర్లను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం డిమాండ్ చేశారు. శ్రీలంక నావికాదళం తమిళ జాలర్లపై తరచూ దాడులకు పాల్పడటం, మర పడవలను, సామగ్రిని స్వాధీనం చేసుకొని జాలర్లను నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడటం ఆనవాయితీగా మారిందన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రధాని మోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి కూడా లేఖలు రాశానని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సమయాల్లో తక్షణ చర్యలు చేపట్టి జాలర్లను విడిపించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇక తాజాగా శ్రీలంక నావికాదళం నిర్బంధించిన 37 మంది జాలర్లను విడిపించే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించేందుకు టీఆర్‌బాలు నాయకత్వంలో ఎంపీల కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సోమవారం ఢిల్లీ బయలు దేరివెళ్లిందని చెప్పారు.
దురైమురుగన్ విమర్శ...
ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ రవి ప్రధాన ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ ప్రభుత్వ బిల్లులకు అంగీకారం తెలపకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారని డీఎంకే ప్రధాన కార్యదర్శి, నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ విమర్శించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలో పర్యటన అనంతరం ఆయన మాట్లాడుతూ... శాసనసభలో సభ్యులందరి ఆమోదంతో పంపిన ప్రతిపాదనలను గవర్నర్ నిరాకరిస్తున్నారన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎంతోమంది గవర్నర్లను చూశానని, ఆర్‌ఎన్ రవి లాంటి గవర్నర్‌ను చూడలేదన్నారు.