CM: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమే!
ABN , First Publish Date - 2023-11-02T09:58:21+05:30 IST
త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమిపాలవుతుందని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమిపాలవుతుందని డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్(CM Stalin) అన్నారు. బుధవారం ఉదయం చెన్నైలో జరిగిన పూందమల్లి డీఎంకే శాసనసభ్యుడు కృష్ణసామి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం బీజేపీ పాలకులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇప్పటివరకూ ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ సంస్థలను ఉసిగొల్పిన ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాంపింగ్ చేసే స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. ప్రస్తుతం దేశ ప్రజలంతా ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందా? ప్రజాస్వామ్య పాలన కొనసాగేనా? అంటూ ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ(BJP) పాలకులు ప్రతిపక్షాలను బెదరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఎంతటివారైన వారిని బెదరించడం, అంతటితో ఆగకుండా ఐటీ, ఈడీ దాడులు జరిపించడం ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతల సెల్‌ఫోన్ సంభాషణలపై నిఘా వేస్తున్నారని, ఫోన్ ట్యాంపింగ్ అవుతున్నట్లు ఆరోపణలు అధికం కాగానే కేంద్ర మంత్రి ఒకరు ఆ ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపి చేతులు దులుపుకున్నారని చెప్పారు.
ఐదు రాష్ట్రాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని సర్వేలు వెలువడుతుండటంతో ఆ పార్టీ నేతలలో గుబులు బయలుదేరిందన్నారు. ఇక డీఎంకే ఎమ్మెల్యే కృష్ణసామి తండ్రి ఎమర్జెన్సీ రోజుల్లో నెలల తరబడి జైలు శిక్షను అనుభవించారని, అత్యవసర పరిస్థితికి మద్దతు ఇవ్వమంటూ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎంతగా ఒత్తిడి చేసినా అప్పటి సీఎం కరుణానిధి పట్టించుకోలేదని, ఫలితంగా అధికారాన్ని కోల్పోయారన్నారు. డీఎంకే ఎప్పుడూ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటుందనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇక ప్రజలకు హాని కలిగించే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. తండ్రి బాటలోనే ఎమ్మెల్యే కృష్ణసామికూడా పదేళ్ల వయస్సు నుండి పార్టీకి సేవలందిస్తూ రెండు సార్లు ఎంపీగా గెలిచారన్నారు. అలాగే ప్రస్తుతం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్నారని చెప్పారు. పార్టీకి సేవలు చేసే కృష్ణసామిలాంటి కార్యకర్తలే డీఎంకేకు బలమని స్టాలిన్ అన్నారు ఈ వివాహ వేడుకల్లో మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, పొన్ముడి, ఉదయనిధి, ఎంపీ టీఆర్ బాలు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్‌మొయుద్దీన్, డీపీఐ అధినేత తిరుమావళవన్ తదితరులు పాల్గొన్నారు.