CM: రూ.7.5లక్షల కోట్ల అవినీతిపై మోదీ మౌనమేల? మళ్లీ మోసపోకుండా బీజేపీని చిత్తుగా ఓడించాలి
ABN , First Publish Date - 2023-09-24T08:32:02+05:30 IST
భారతదేశ ప్రజలు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన హామీలను నమ్మి మోసపోయారని, 2024లో జరగనున్న ఎన్నికల్లో
- ఓటర్లకు స్టాలిన్ పిలుపు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): భారతదేశ ప్రజలు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన హామీలను నమ్మి మోసపోయారని, 2024లో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ మోసపోకుండా చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పిలుపునిచ్చారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ పేరుతో స్టాలిన్ తన ప్రసంగాలను సంబంధించిన ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన తన రెండో ఆడియోను వెలువరించారు. ఆ ఆడియలో స్టాలిన్ మాట్లాడుతూ... భారతదేశాన్ని అత్యంత సంపన్న దేశంగా మారుస్తానని శపథం చేసిన ప్రధాని నరేంద్రమోదీ దాన్ని నెరవేర్చ లేకపోయారన్నారు. బీజేపీకి ఐదేళ్ల పాలనను అప్పగిస్తే సంపన్న దేశంగా మారుతుందని గొప్పలు చెప్పుకున్నారని, ఆయన మాటలను నమ్మి ప్రజలు పదేళ్లపాటు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేక పోయారన్నారు. అవినీతి అక్రమాలు, మత విద్వేషాలు, వర్గ విభేదాలు, ఘర్షణలు, మోసాలకు పాల్పడడమే తమ ఆశయంగా పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించే రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా ఈసారి దేశ ప్రజలంతా ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షాల ఇండియా కూటమి ప్రచారం కారణంగా బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఇందుకు నిదర్శనమన్నారు.
కాగ్ నివేదికలో రూ.7.5లక్షల కోట్ల అవినీతి....
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ప్రత్యేక సమావేశాల్లో ఆ అంశాలపై ఎందుకు చర్చించడం లేదో ప్రజలకు స్పష్టం చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల్లో రూ.7.5లక్షల కోట్ల మేరకు అవినీతి, అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ప్రకటించిందని, దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఐదు ‘టీ’లు పోయి ఐదు ‘సీ’లు మిగిలాయి...
నరేంద్రమోదీ ప్రధాని పదవిని చేపట్టినప్పుడు తనకు ఆంగ్లంలో ఐదు ‘టీ’లే ముఖ్యమని పేర్కొంటూ.. టాలెంట్ (ప్రతిభ), ట్రేడింగ్ (వాణిజ్యం), ట్రెడిషన్ (సంప్రదాయం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వల్లెవేశారని ఎద్దేవా చేశారు. ఆ ఐదు ‘టీ’ల సంగతిని తొమ్మిదేళ్లుగా మరచిపోయిన మోదీ ప్రభుత్వం కరప్షన్ (అవినీతి), కమ్యూనలిజం (మతతత్వవాదం), కార్పొరేట్ కేపిటలిజం (కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకే ప్రోత్సాహం) చీటింగ్ (మోసాలకు పాల్పడటం), క్యారెక్టర్ అసాసినేషన్ (శీల హత్య) అంటూ ప్రస్తుతం ఐదు ‘సి’లతో కొట్టుమిట్టాడుతోందని స్టాలిన్ ధ్వజమెత్తారు.