CM Stalin: ప్రధాని మోదీపై సీఎం స్టాలిన్ ఫైర్.. విమర్శిస్తే సీబీఐ, ఈడీతో బెదిరింపులా..
ABN , First Publish Date - 2023-07-07T08:08:45+05:30 IST
తొమ్మిదేళ్ల మోదీ అసమర్థ పాలనను విమర్శించే ప్రత్యర్థులను సీబీఐ, ఈడీ(CBI, ED) వంటి దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించడమే బీజేపీ ఆనవాయితీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తొమ్మిదేళ్ల మోదీ అసమర్థ పాలనను విమర్శించే ప్రత్యర్థులను సీబీఐ, ఈడీ(CBI, ED) వంటి దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించడమే బీజేపీ ఆనవాయితీగా పెట్టుకుందని, ఆ దర్యాప్తు సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగానే పని చేస్తున్నాయని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు. స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయం కలైంజర్ అరంగంలో గురువారం ఉదయం జరిగిన ముఖ్యమంత్రి సతీమణి దుర్గాస్టాలిన్ మేనల్లుడు రంగరాజన్ వివాహ వేడుకల అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సం బంధిత కార్యక్రమాల్లోనే అధికంగా పాల్గొంటుండటంతో కుటుంబీకులను కలుసుకునే తీరిక లేకపోయిందని బాధపడుతుండేవాడినని స్టాలిన్ అన్నారు. ఈక్రమంలో తన బావమరిది డాక్టర్ జయ రాజమూర్తి కుమారుడి వివాహ వేడుకల్లో కుటుంబీకులందరినీ కలుసుకునే అవకాశం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ జయ రాజమూర్తి వైద్యుడిగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా పేరుగడించారని, వల్లలార్ రామలింగ అడిగళార్ బోధనలను బాగా ఔపోసన పట్టారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఒకరు వల్లలార్‌ను సనాతన ధర్మాన్ని పాటించిన వ్యక్తి అంటూ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసునని పరోక్షంగా గవర్నర్ గురించి ప్రస్తావించారు. తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్ళి చెప్పలేకున్నదని, రాష్ట్రంలో రెండేళ్ల డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ద్రావిడ తరహా పాలనను చూసి బీజేపీ నాయకులు ఓర్వలేకున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చని బీజేపీ పాలకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సెక్యులర్ దేశంగా పేరుగడించిన భారతదేశంలో సనాతన ధర్మాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ నిరంకుశ పాలనను చూసి దేశ ప్రజలంతా వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో ఇప్పటికే సివిల్ చట్టం, క్రిమినల్ చట్టం ఉండగా బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకువచ్చి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారిపై కక్షసాధింపు చర్యలు పాల్పడాలని కుట్రపన్నుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులంతా కుటుంబ సభ్యులుగా ప్రవర్తిస్తుండడంతో డీఎంకే కుటుంబ పాలనే సాగుతోందని ఇటీవల ఇదే వేదికపై జరిగిన వివాహ వేడుకల్లో ప్రసంగించడం ప్రధాని మోదీకి మంటపుట్టించిందన్నారు. రాష్ట్రంలో అడ్డదారుల్లో బీజేపీ బలాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇక పై ఆపార్టీకి మనుగడ ఉండదని, డీఎంకే పాలనే కొనసాగుతుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.