CM Stalin: ఎంఐటీ ప్రాంగణంలో రూ.50కోట్లతో కళామందిరం

ABN , First Publish Date - 2023-07-21T10:18:56+05:30 IST

స్థానిక క్రోంపేటలోని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) కళాశాల ప్రాంగణంలో రూ.50 కోట్లతో ఇండోర్‌ స్టేడియంతోపాటు భారీ

CM Stalin: ఎంఐటీ ప్రాంగణంలో రూ.50కోట్లతో కళామందిరం

- వజ్రోత్సవాల్లో సీఎం స్టాలిన్‌ ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): స్థానిక క్రోంపేటలోని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) కళాశాల ప్రాంగణంలో రూ.50 కోట్లతో ఇండోర్‌ స్టేడియంతోపాటు భారీ కళామందిరాన్ని ప్రభుత్వ సహకారంతో నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. గురువారం ఉదయం జరిగిన ఆ కళాశాల వజ్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఏసీ సదుపాయంతో హాలు కూడా నిర్మించనున్నామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, నాణ్యమైన విద్యనందించే సంస్థలున్న రాష్టంగా కీర్తిగడిస్తోందని, అలాంటి విద్యా సంస్థల్లో ఎంఐటీ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. 1952లో జరిగిన ఈ విద్యా సంస్థ తొలి స్నాతకోత్సవంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ పాల్గొన్నారని, ఆ తర్వాత ఈ సంస్థలో ఇంజనీరింగ్‌, ఎలక్ర్టానిక్స్‌ ప్రయోగ, పరిశోధన శాలలను మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌ ప్రారంభించారని, 1975లో జరిగిన ఈ విద్యా సంస్థ రజతోత్సవాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. ఇక ఈ కళాశాలలోనే విద్యనభ్యసించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ 1998లో జరిగిన స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారని, ఇంతటి మహానుభావులు సందర్శించిన ఈ సంస్థ వజ్రోత్సవాల్లో తాను పాల్గొనటం ఆనందంగా ఉందని స్టాలిన్‌ పేర్కొన్నారు. నగరానికి చెందిన తమిళ పారిశ్రామికవేత్త దానశీలి సి. రాజమ్‌ ఇండియా హౌస్‌ తన యావదాస్తిని విరాళంగా ఇచ్చి ఎంఐటీని 1949లో నెలకొల్పారని, ఆ తరువాత ఆయన కుమారుడు సీఆర్‌ రామసామి, ప్రస్తుతం ఆయన మనవరాలు డాక్టర్‌ ప్రేమా శీనివాసన్‌ ఈ విద్యా సంస్థను సమర్థవంతంగా నడిపుతూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని తెలిపారు. ఇలా వారసుల వల్ల వేలాదిమంది విద్యనభ్యసించి ఉన్నతస్థితికి చేరుకున్నారని, వారసుల వల్ల యుశక్తి మేథోశక్తిగా మారిందని, తాను పదేపదే వారసులు అని చెప్పడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవంటూ సభికులను నవ్వించారు. వారసులు తలచుకుంటే మూడు నాలుగు తరాలకు సేవలందించవచ్చునన్నారు. ఈ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, దామో అన్బరసన్‌, శాసనసభ్యులు రాజా, ఇ. కరుణానిధి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కార్తీక్‌, అన్నా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ వేల్‌రాజ్‌, ఎంఐటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకాష్‌, ఎంఐటీ వ్యవస్థాపకుల వారసురాలు ప్రేమా శీనివాసన్‌, ఎంఐటీ విద్యార్థుల సంఘం మాజీ అధ్యక్షుడు సెంథిల్‌నాధన్‌ తదితరులు పాల్గొన్నారు.

nani6.1.jpg

Updated Date - 2023-07-21T10:18:58+05:30 IST