CM Stalin: తుఫాను బాధితులకు రూ.6 వేల సాయం
ABN , First Publish Date - 2023-12-10T10:24:24+05:30 IST
చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను బాధితులకు రూ.6వేల చొప్పున సాయం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- ఇళ్లు కోల్పోయినవారికి నష్టపరిహారం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను బాధితులకు రూ.6వేల చొప్పున సాయం అందించనున్నట్లు సీఎం స్టాలిన్(CM Stalin) ప్రకటించారు. ఈ సహాయాన్ని ఆయా ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల ద్వారా నగదు రూపంలో అందిస్తామని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో తుఫాను బాధిత ప్రాంతాల్లో జరుగుతున్న పునరావాస కార్యక్రమాలు, బాధితులకు అందిస్తున్న సహాయాలపై శనివారం ఉదయం సచివాలయంలో సీఎం సమీక్షించారు. మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ రామచంద్రన్, తంగం తెన్నరసు, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ... ‘మిచౌంగ్’ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు మునుపటిలా అధిక ప్రాణ నష్టం జరుగకపోవడానికి ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, కొత్తగా నిర్మించిన వాననీటి కాల్వలే కారణమని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 58,222 కేజీల పాల పొడి, 9.67 లక్షల వాటర్ బాటిళ్లు, 2.65 లక్షల బ్రెడ్ ప్యాకెట్లు, 10.38 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను సరఫరా చేశామన్నారు. తుఫాను బాధితులను చెన్నై సహా నాలుగు జిల్లాల కలెక్టర్లు సకాలంలో ఆదుకున్నారని ప్రశంసించారు. ఈ పరిస్థితుల్లో తుఫాను బాధితులను ఆర్ధికపరంగా ఆదుకోవాలని మంత్రులు, అధికారుల సమీక్షా సమావేశంలో సమష్టి నిర్ణయం తీసుకున్నామని, ఆ మేరకు తుఫాను బాధిత కుటుంబాలకు తలా రూ.6వేలు చొప్పున సాయం అందించనున్నామని, ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు సాయం...
తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తలా రూ.5లక్షలను అందిస్తామని సీఎం తెలిపారు. దెబ్బతిన్న గుడిసెలకు చెల్లిస్తున్న సహాయాన్ని రూ.5వేల నుండి రూ.8వేలకు పెంచినట్లు తెలిపారు. వరదనీటిలో 33 శాతానికి మించి నీట మునిగిన వరికి హెక్టారుకు రూ. 13,500 చొప్పున చెల్లిస్తున్న నష్టపరిహారాన్ని రూ.17వేలకు పెంచి అందిస్తామన్నారు. ఏళ్లతరబడి పండించే పంటలు 33 శాతానికి మించి నష్టపోతే ప్రస్తుతం హెక్టారుకు రూ.18వేల చొప్పున చెల్లిస్తున్న నష్టపరిహారాన్ని రూ.22,500లకు పెంచి అందిస్తామన్నారు. ఇక ఎద్దులు, పశువులు తదితర పశుగణాలు మృతి చెందితే ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారాన్ని రూ.30వేల నుండి రూ.37500లకు పెంచినట్టు తెలిపారు. మేకలు, పొట్టేళ్లు మృతి చెందితే ఒక్కో దానికి రూ.4వేలు అందిస్తామన్నారు.
మత్స్యకారులకు....
వరదలు, తుఫాను కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పడవలు, వలలకు చెల్లించే నష్టపరిహారాన్ని రూ.32వేల నుండి రూ.50వేలకు పెంచిన్నట్లు చెప్పారు. పాక్షికంగా దెబ్బతిన్న పడవలకు రూ.15 వేలు అందిస్తామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న మరపడవలకు రూ.5లక్షల నుంచి రూ.7.5లక్షలకు పెంచి మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. కాగా సమావేశంలో రెవెన్యూ శాఖ కమిషనర్ ఎస్కే ప్రభాకర్, ఆహారం, వినియోగదారుల పరిరక్షణ శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.గోపాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డి.ఉదయచంద్రన్, నగరపాలనీటి సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.కార్తికేయన్, రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి వి.రాజారామన్, విపత్తుల నిర్వహణ సంచాలకుడు ఎస్‌ఏ రామన్ తదితరులు పాల్గొన్నారు.
పెరంబూర్(చెన్నై): తుఫాను కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా అందించనున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. మిచౌంగ్ తుఫాను కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌మెషిన్ సహా పలు పరికరాలు నీటిలో తడిచి పనికిరాకుండా పోయాయి. అదే సమయంలో బీరువాల్లో ఉంచిన విద్యార్హత సర్టిఫికెట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలు తడిచిపోయాయి. ఈ క్రమంలో, విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు అందజేయాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లో ఈనెల 11న సోమవారం, చెన్నై కార్పొరేషన్ పరిధిలోని మండల కార్యాలయాల్లో ఈనెల 12న మంగళవారం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో దరఖాస్తులు సమర్పించి సర్టిఫికెట్లను ఉచితంగా పొందవచ్చు.