CM's order: ఆ పథకాల అమలుపై నిఘా వేయండి
ABN , First Publish Date - 2023-08-05T10:53:22+05:30 IST
రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రాధాన్యతా పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పథకాల ఫలితాలు ఎంతమేరకు సత్ఫలితాలి
- మంత్రులకు, అధికారులకు సీఎం ఆదేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రాధాన్యతా పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పథకాల ఫలితాలు ఎంతమేరకు సత్ఫలితాలిస్తున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రులు, అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఆదేశించారు. సచివాలయం సమీపంలో నామక్కల్ కవింజర్ మాళిగై హాలులో శుక్రవారం ఉదయం ప్రాధాన్యాతా పథకాల అమలుపై ఆయన చర్చించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రత్యేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆ కోవలో గృహిణులకు ప్రతినెలా రూ.1000 వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే పథకం వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం అమలు చేయాల్సిన తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రత్యేక పథకాల అమలుశాఖ మంత్రి ఉదయనిధి, మంత్రులు కే.ఎన్.నెహ్రూ, ఐ.పెరియసామి, ముత్తుసామి, దామో అన్బరసన్, రామచంద్రన్, పెరియకరుప్పన్, కయల్‌విళి సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా, సహకార, స్థానిక సంస్థలు, గృహ, నగరపాలక, రెవెన్యూ, ఆదిద్రావిడుల శాఖలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. బడిపిల్లల అల్పాహారం, మహిళా స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణ సహాయం, పుదుమైపెణ్ పథకం, నాన్ ముదల్వన్, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు గురించి ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షించారు. జిల్లాలవారీగా ప్రతి పథకం ఏ మేరకు అమలు చేశారనే విషయాన్ని శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రాధాన్యతా పథకాల అమలు వేగంగా జరగడం లేదని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్లకు శాఖాధికారులు సకాలంలో ఆదేశాలిచ్చి కుగ్రామాల్లో ఉన్న ప్రజలకు సైతం పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం కోరారు.
451 మందికి నియామక ఉత్తర్వులు...
సచివాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో నగరపాలక, నీటి సరఫరా శాఖల్లో విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల వారసులు 451 మందికి కారుణ్య ప్రాతిపదికగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పంపిణీ చేశారు. ఆ మేరకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లో 227 మంది ఈ ఉత్వర్లును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక శాఖ మంత్రి కే.ఎన్. నెహ్రూ, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్ ప్రియ, కమిషనర్ డాక్టర్ జే రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.