Tamil Nadu governor Row : బీజేపీ కార్యకర్తలుగా గవర్నర్లు : ఖర్గే

ABN , First Publish Date - 2023-01-11T20:30:40+05:30 IST

గవర్నర్లను పార్టీ కార్యకర్తలుగా బీజేపీ (BJP) వాడుకుంటోందని కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

Tamil Nadu governor Row : బీజేపీ కార్యకర్తలుగా గవర్నర్లు : ఖర్గే
Mallikharjun Kharge, Congress Chief

న్యూఢిల్లీ : గవర్నర్లను పార్టీ కార్యకర్తలుగా బీజేపీ (BJP) వాడుకుంటోందని కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi), ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఖర్గే ఘాటుగా స్పందించారు. కొందరు గవర్నర్లు నిస్సిగ్గుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండటం వల్ల భారత దేశ సమాఖ్య నిర్మాణం సమగ్రతకు కళంకం ఏర్పడుతోందన్నారు.

తమిళనాడు రాష్ట్రానికి తమిళగం అనే పదం సరిగ్గా సరిపోతుందని ఆర్ఎన్ రవి ఇటీవల వ్యాఖ్యానించడంతో డీఎంకే (DMK) తదితర పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శాసన సభ శీతాకాల సమావేశాల మొదటి రోజున (సోమవారం) సంప్రదాయం ప్రకారం ప్రసంగించిన గవర్నర్ తనకు ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాలను వదిలిపెట్టారు. దీంతో ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగం మాత్రమే రికార్డుల్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stallin) ఓ తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఖర్గే ఇచ్చిన ట్వీట్‌లో, గవర్నర్లను ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం ద్వారా రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ల వ్యవస్థకు కళంకం తెచ్చేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కొందరు గవర్నర్లు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అతిక్రమించడం వల్ల మన దేశ సమాఖ్య నిర్మాణానికి విఘాతం కలుగుతోందన్నారు.

గవర్నర్లు రాజ్యాంగ చట్రంలో పని చేయాలని, తాము భాగంగా ఉన్న చట్టసభను అవమానించకూడదని చెప్పారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ, సాంఘిక అనిశ్చితిని సృష్టించేందుకు ఢిల్లీ పెద్దలు వారిని మాయ చేస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

Updated Date - 2023-01-11T20:30:44+05:30 IST