Digvijay Singh: భారత్ జోడో వేళ దుమారం
ABN , First Publish Date - 2023-01-23T16:45:25+05:30 IST
భారత్ జోడో వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపారు.
జమ్మూ: భారత్ జోడో వేళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపారు. అసలు సర్జికల్ దాడులే జరగలేదన్నారు. సర్జికల్ దాడులకు ఆధారాలే లేవన్నారు. నియంత్రణను రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను చంపేశామని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని దిగ్విజయ్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 2016, 2019లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ దాడులకు సంబందించి మోదీ సర్కారు పార్లమెంట్‌కు ఆధారాలు సమర్పించలేదని దిగ్విజయ్ చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలంతా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని దిగ్విజయ్ కోరారు. దిగ్విజయ్ గతంలో కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. జమ్మూలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిందేనన్నారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసింది.
2016, సెప్టెంబర్ 29న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నియంత్రణ రేఖను దాటి సర్జికల్ దాడులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాడుల్లో పాకిస్థాన్‌వైపు పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని నాటి మోదీ ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 18న జమ్మూకశ్మీర్‌లోని యూరీలో సైనిక స్థావరంపై పాక్ ప్రేరిత నలుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 19 మంది భారత సైనికులు చనిపోయారు. ప్రతిగా పది రోజుల్లోనే భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించినట్లు భారత సైన్యానికి చెందిన డైరక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ నాడు వెల్లడించారు.
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. నాటి ఘటనలో 46 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలకోట్ సమీపంలో ఉగ్రవాదుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మరుసటి రోజు తమ దేశానికి చెందిన ఎఫ్ 16ను కూల్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ బందీగా చేసుకుంది. ఆ తర్వాత మోదీ సర్కారు వ్యూహంతో పాక్ దారిలోకి వచ్చి మార్చ్ ఒకటిన అభినందన్‌ను విడుదల చేసింది.