Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ
ABN , First Publish Date - 2023-08-07T10:47:25+05:30 IST
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరిగి వయనాడ్ ఎంపీగా (MP) కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరిగి వయనాడ్ ఎంపీగా (MP) కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా.. ‘మోదీ ఇంటిపేరు’ కేసులో రెండేళ్ల జైలుశిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్ట్ స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్‌సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది.
కాగా.. ‘మోదీ ఇంటిపేరు కేసులో’ దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ మార్చి 23, 2023న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజు మార్చి 24, 2023న రాహుల్‌పై అనర్హతవేటుపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియేట్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
12 గంటలకు పార్లమెంట్‌కు రాహుల్..
ఎంపీగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నేతల నుంచి కార్యకర్తల వరకు తెగ సంబరపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందంతో తన సహచర నేతలకు స్వీట్లు పంచిపెట్టారు. కాగా అనర్హత తర్వాత తొలిసారి ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు రానున్నారు.