New Year : వీథికో ప్రేమ దుకాణం : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2023-01-01T13:18:31+05:30 IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ఇచ్చిన ట్వీట్‌లో,
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారం దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023వ సంవత్సరంలో ప్రతి వీథి, ప్రతి గ్రామం, ప్రతి నగరంలో ఓ ప్రేమ దుకాణం ఏర్పాటవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) విశేషాలను షేర్ చేశారు. బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, దానికి విరుగుడుగా కాంగ్రెస్ ప్రేమను పంచుతుందని ఇటీవల ఆయన తెలిపిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ఇచ్చిన ట్వీట్‌లో, నూతన సంవత్సరం సందర్భంగా, ఆరోగ్యవంతమైన రాజస్థాన్, సర్వతోముఖాభివృద్ధి చెందే రాష్ట్రం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా, సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ (Bhupesh Baghel) ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో కొత్త ఆశలు, సకారాత్మక శక్తి (positive energy)తో 2023ను మనమంతా స్వాగతిద్దామన్నారు.
ఇదిలావుండగా, 2023వ సంవత్సరం ప్రారంభం సందర్భంగా వారణాసిలోని అస్సీ ఘాట్ వద్ద ఆదివారం తెల్లవారుజామున గంగా నదికి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుని దేవాలయంలో కూడా మహాశివునికి భస్మ హారతి ఇచ్చారు. ఈ దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి భక్తులు వచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివలింగానికి భస్మాన్ని పెట్టే ఏకైక జ్యోతిర్లింగం ఇదేనని ఈ దేవాలయం అర్చకుడు తెలిపారు.
ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో కూడా విఘ్నేశ్వరునికి ఆదివారం తెల్లవారుజామున హారతి ఇచ్చారు.