Share News

Jammu and Kashmir: లోయలో లక్షిత హత్యలు...మూడు రోజుల్లో మూడో ఘటన

ABN , First Publish Date - 2023-11-01T20:26:31+05:30 IST

కశ్మీర్‌‌లో తిరిగి లక్షిత హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అతి స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక ఘటనలు చోటుచేసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. నార్త్ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్రాల్‌పోర గ్రామంలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ఒకరిని టెర్రరిస్టులు బుధవారం కాల్చిచంపారు.

Jammu and Kashmir: లోయలో లక్షిత హత్యలు...మూడు రోజుల్లో మూడో ఘటన

శ్రీనగర్: కశ్మీర్‌ (Kashmir)లో తిరిగి లక్షిత హత్యలు (target killings) చోటుచేసుకుంటున్నాయి. అతి స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక ఘటనలు చోటుచేసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. నార్త్ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా క్రాల్‌పోర గ్రామంలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ఒకరిని టెర్రరిస్టులు బుధవారం కాల్చిచంపారు. టెర్రరిస్టులు గత మూడు రోజుల్లో జరిపిన మూడో ఘాతుకం ఇది. తాజా ఘటనతో క్రాల్‌పోర గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


కానిస్టేబుల్ గులాం మొహమ్మద్ డర్‌ను ఆయన నివాసం సమీపం వద్దే టెర్రరిస్టులు కాల్చిచంపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు. ఆయనపై టెర్రరిస్టులు ఐదు బుల్లెట్లు కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గులాం మొహమ్మద్‌కు ఏడుగురు కుమార్తెలు ఉండగా, కుటుంబం మొత్తం ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ఒక అమ్మాయికి వివాహం కుదరడంతో ఆ ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు. డర్ గత 25 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేస్తున్నారని, ప్రతి జిల్లాలోనూ ఆయన పని చేశారని, కుమార్తె పెళ్లికి సన్నాహాలు చేసుకుంటుంన్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆయన సన్నిహితుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.


కాగా, గత ఆదివారంనాడు శ్రీనగర్ ఈద్గా ఏరియాలో జమ్మూకశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై మస్రూస్ అహ్మద్‌పై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈద్గా ఏరియాలో పిల్లలో క్రికెట్ ఆడుతుండగా ఆయనపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. ఇదే రోజు టెర్రరిస్టులు పుల్వామా జిల్లా నౌపోర గ్రామంలో ఒక వలస కార్మికుడిని కాల్చిచంపారు. ఏడాది తర్వాత మళ్లీ లోయలో లక్షిత కాల్పులు చోటుచేసుకోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


లక్షిత హత్యలను ఆపండి: ఒమర్ అబ్దుల్లా

కశ్మీర్ లోయలో తిరిగి లక్షిత హత్యలు చోటుచేసుకోవడంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. దాడులను ఖండించారు. ఈ తరహా దాడులకు స్థానం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిపై మాట్లాడాలని ఆయన కోరారు. అంతా ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం పదేపదే చెబుతోందని, అయితే మళ్లీ లక్షిత హత్యలు తలెత్తుతున్నాయని, కొన్నిసార్లు పోలీసులపై, మరికొన్ని సాధారణ పౌరులపై ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు తప్పుదారి పట్టిస్తోందని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2023-11-01T20:26:31+05:30 IST