Bihar : రాముడిగా నితీశ్, రావణుడిగా మోదీ... రబ్రీ దేవి నివాసం, ఆర్జేడీ కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం...

ABN , First Publish Date - 2023-01-14T15:53:57+05:30 IST

రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత రబ్రీ దేవి, పాట్నాలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

Bihar : రాముడిగా నితీశ్, రావణుడిగా మోదీ... రబ్రీ దేవి నివాసం, ఆర్జేడీ కార్యాలయం వద్ద పోస్టర్ల కలకలం...
Posters at RJD Offices and Rabri Devi residence

పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత రబ్రీ దేవి, పాట్నాలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించినట్లు (భావిస్తూ) వీటిలో ప్రదర్శించారు. నితీశ్ కుమార్‌ (Nitish Kumar)ను శ్రీరాముడిగానూ, శ్రీకృష్ణుడిగానూ; ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని రావణాసురుడిగానూ, కంసుడిగానూ ప్రదర్శించారు.

ఒక్కొక్క పోస్టర్‌ను రెండు నిలువు వరుసలుగా, మూడు అడ్డు వరుసలుగా విభజించారు. మొదటి అడ్డు వరుసలో శ్రీరాముడు రావణాసురుడిని ఓడించినట్లు చూపించారు. ఒకవైపు శ్రీరాముడిని, మరోవైపు రావణాసురుడిని చూపించారు. రెండో అడ్డు వరుసలో శ్రీకృష్ణుడు కంసుడిని ఓడించినట్లు చూపించారు. ఒకవైపు శ్రీకృష్ణుడిని, మరోవైపు కంసుడిని చూపించారు. మూడో అడ్డు వరుసలో బీజేపీని మహా కూటమి ఓడించినట్లు చూపించారు. ఒకవైపు రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్ తదితర నేతలను, మరోవైపు నరేంద్ర మోదీ, తదితర బీజేపీ నేతలను చూపించారు. మహాకూటమి జిందాబాద్ అనే నినాదాలు కూడా ఈ పోస్టర్‌లో ఉన్నాయి. చాప్రాకు చెందిన పూనమ్ రాయ్ ఫొటోను కూడా ముద్రించారు.

ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ తివారీ మాట్లాడుతూ, ఈ పోస్టర్లను ఎవరు పెట్టారో తనకు తెలియదన్నారు. వీటిని తమ పార్టీ అధికారికంగా ఏర్పాటు చేయలేదన్నారు. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే ప్రయత్నాలకు సన్నాహాలు బిహార్ నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యాయని తెలిపారు. పేదలు, యువత, రైతులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీతోనే పోరాటమని చెప్పారు. నితీశ్ కుమార్ బిహార్‌లో బాధ్యత చేపట్టారని, సమైక్య ప్రతిపక్షానికి ఆయనే నాయకుడు కాగలరని చెప్పారు. ప్రతి బిహారీ దీనినే కోరుకుంటున్నారన్నారు.

ఈ పోస్టర్‌పై బీజేపీ అధికార ప్రతినిధి నావల్ కిశోర్ యాదవ్ స్పందిస్తూ, ప్రతిపక్ష నేతల్లో చేరినవారిలో నితీశ్ కుమార్ కొత్తవారన్నారు. నరేంద్ర మోదీ 2034 వరకు అధికారంలో కొనసాగుతారని చెప్పారు. నితీశ్, అఖిలేశ్ యాదవ్, మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్ తదితరులు ఎవరైనా సరే మోదీని ఓడించలేరని తెలిపారు.

Updated Date - 2023-01-14T15:54:01+05:30 IST