Narendra Modi: పోస్టర్లు, కాంగ్రెస్ నేతల లాకర్లలోనే అభివృద్ధి కనిపిస్తుంది
ABN , First Publish Date - 2023-10-03T14:36:26+05:30 IST
బస్తర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితిని దిగజార్చిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో విసుగెత్తిపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అవినీతి, నేరాలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు.అభివృద్ధి అనేది పోస్టర్లలోనూ, కాంగ్రెస్ నేతల లాకర్లలోనూ కనిపిస్తుందని అన్నారు.
బస్తర్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితిని దిగజార్చిందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో విసుగెత్తిపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అవినీతి, నేరాలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు. ఒక్కోసారి రాజస్థాన్‌ను తలపిస్తుందని, నేరాల రేటులో అవి రెండూ పోటీపడుతున్నాయని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అభివృద్ధి అనేది పోస్టర్లలోనూ, కాంగ్రెస్ నేతల లాకర్లలోనూ కనిపిస్తుందని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని జగ్‌దల్‌పూర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం పటిష్టతకు కట్టుబడి వేల కోట్లతో ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పారు.
దేశ అభివృద్ధి కోసం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఫిజికల్, డిటిజల్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకోసం గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు వెచ్చించిందని చెప్పారు. 2014తో పోలిస్తే ఛత్తీస్‌గఢ్‌కు రైల్ బడ్జెట్ 20 రెట్లు పెంచామని చెప్పారు.
కాంగ్రెస్ దశాబ్దాల నిర్లక్ష్యం
బస్తర్ ప్రాంతాన్ని కాంగ్రెస్ దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రయోజనాలను పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని ప్రధాని ఆరోపించారు. బీజేపీ మాత్రం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ ఇక్కడి గిరిజనులకు ఐదు రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయింపులు ఇచ్చిందన్నారు. కాగా, దీనికి ముందు బస్తర్‌లో దంతేశ్వరి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా బస్తర్ ప్రాంతంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.