14న హాజరు కావాల్సిందే.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు కోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2023-06-16T09:01:04+05:30 IST
డీఎంకే కోశాధికారి, లోక్‌సభ సభ్యుడు టీఆర్ బాలు దాఖలు చేసిన పరువునష్టం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జూలై 14వ
పెరంబూర్(చెన్నై): డీఎంకే కోశాధికారి, లోక్‌సభ సభ్యుడు టీఆర్ బాలు దాఖలు చేసిన పరువునష్టం కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జూలై 14వ తేది హాజరుకావాలని సైదాపేట కోర్టు ఆదేశించింది. డీఎంకేకు చెందిన 12 మంది ప్రముఖుల ఆస్తుల వివరాలను కొద్దిరోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వెల్లడించారు. అలాగే, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సహా పలువురు డీఎంకే నేతలపై పలురకాల ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో జాబితాలోని పలువురు అన్నామలైకు నోటీసులు జారీచేశారు. అయినా తన ఆరోపణల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నామలై తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, చెన్నై జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో అన్నామలైపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరఫున క్రిమినల్ కేసు దాఖలైంది. అలాగే, డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు, అన్నామలైకు వ్యతిరేకంగా సైదాపేట 18వ న్యాయస్థానంలో పరువు నష్టం కేసు వేశారు. ఆ పిటిషన్‌లో 1957 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎంపీ, కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు చేపట్టడంతో పాటు ప్రజల అభిమానం చూరగొన్నానని తెలిపారు. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా అన్నామలై అనుచిత, అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు 21 సంస్థల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని ఆరోపించారని తెలిపారు. కానీ, ఆయన పేర్కొన్న సంస్థల్లో మూడింటిలో మాత్రమే అది తక్కువ పెట్టుబడులున్నాయని, మిగతా సంస్థల్లో భాగస్వామ్యం లేదన్నారు. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన అన్నామలై తనకు నష్టపరిహారం అందించాలని, అలాగే, అతనిపై క్రిమినల్ పరువు నష్టం కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అన్నామలై జూలై 14వ తేదీన హాజరుకావాలని ఉత్తర్వులు జారీచేసింది.