Delhi liquor scam: మనీశ్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ABN , First Publish Date - 2023-04-29T17:26:13+05:30 IST
ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కుంభకోణం (Delhi excise policy scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కుంభకోణం (Delhi excise policy scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు శనివారం పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నమోదు చేసిన ఈ కేసులో ఆయనకు జ్యుడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులు ఆయనను శనివారం కోర్టులో హాజరుపరిచారు.
సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ శనివారంతో ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ సమక్షంలో హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
సిసోడియా బెయిలు దరఖాస్తును కోర్టు శుక్రవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేరంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు చెప్తున్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసులో సాక్షులను సిసోడియా ప్రభావితం చేస్తారనే వాదనను కొట్టిపారేయలేమని తెలిపింది.
ఢిల్లీ ఎక్సయిజ్ విధానం కేసును సీబీఐ (CBI), ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో అక్రమాలు, అవినీతి జరిగినట్లు సీబీఐ నమోదు చేసిన కేసులో ఆరోపించింది. ఈ కేసులో సిసోడియా బెయిలు దరఖాస్తును కోర్టు మార్చి 31న తోసిపుచ్చింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈ విధానం రూపకల్పనలో లిక్కర్ కంపెనీల ప్రమేయం ఉందని, సౌత్ గ్రూప్ అనే లిక్కర్ లాబీ భారీగా ముడుపులను చెల్లించిందని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ ప్రశ్నించింది. అదే విధంగా తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది.
సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న, ఈడీ మార్చి 9న అరెస్టు చేశాయి.
ఇవి కూడా చదవండి :
Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష
Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే