Wrestlers : రెజ్లర్లపై వేధింపుల కేసు.. బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు..

ABN , First Publish Date - 2023-07-07T16:24:59+05:30 IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారించదగినదేనని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయించింది.

Wrestlers : రెజ్లర్లపై వేధింపుల కేసు.. బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు..
Brij Bhushan Sharan Singh

న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh) మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసు విచారించదగినదేనని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది. నిందితునిపై విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై జూన్ 15న ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ కేసులో దర్యాప్తు ఆలస్యమవుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లను, 10 ఫిర్యాదులను నమోదు చేశారు. ఆయన మహిళా రెజ్లర్లను లైంగిక వాంఛలు తీర్చాలని కోరినట్లు ఆరోపించారు. మహిళా రెజ్లర్లపట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు, వారి ఛాతీలను అసభ్యకరంగా ముట్టుకున్నట్లు, వారిని వెంటతరిమినట్లు ఆరోపించారు.

బ్రిజ్ భూషణ్‌పై ఏప్రిల్ 21న ఫిర్యాదులను నమోదు చేశామని, ఏప్రిల్ 28 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆరుగురు ఒలింపియన్లు చేసిన ఆరోపణలతో ఓ ఎఫ్ఐఆర్‌ను, ఓ మైనర్ అథ్లెట్ తండ్రి చేసిన ఫిర్యాదుపై మరో ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశామన్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

బ్రిజ్ భూషణ్ తనను గట్టిగా పట్టుకున్నారని మైనర్ రెజ్లర్ ఆరోపించారు. ఫొటోలు తీసుకోవాలనే నెపంతో ఆయన ఈ దురాగతానికి ఒడిగట్టారని చెప్పారు. ఇటువంటి పనులు చేయవద్దని తాను ఆయనకు చెప్పానని తెలిపారు. ఈ కేసును మైనర్ రెజ్లర్ ఉపసంహరించుకున్నారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై స్పందించాలని ఢిల్లీ కోర్టు ఈ మైనర్‌ను, ఆమె తండ్రిని ఇటీవల ఆదేశించింది.

తన టీ-షర్ట్‌ను లాగి, తన ఛాతీపై ఆయన చేయి పెట్టారని మరో రెజ్లర్ ఆరోపించారు. తనను ఆయనవైపు బలంగా లాక్కున్నారని చెప్పారు.

శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలిస్తానంటూ తన ఛాతీ, పొట్ట భాగాల్లో ఆయన చేతులు వేశారని మరో రెజ్లర్ ఆరోపించారు. మరో రెజ్లర్‌ను ఆయన కౌగిలించుకుని, ముడుపులు ఇస్తానని చెప్పారని ఆరోపణలు నమోదయ్యాయి. తన భుజాలను గట్టిగా నొక్కారని మరో రెజ్లర్ ఆరోపించారు.

బ్రిజ్ భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 23 నుంచి మే 28 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరికి రైతు సంఘాలతో సహా అనేక మంది మద్దతు పలికారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్‌కతాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ జూన్ 7న ఆయన నివాసానికి వెళ్లారు. బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదుల గురించి చర్చించారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశం అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, జూన్ 15నాటికి బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీటు దాఖలు చేస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు జూన్ 30నాటికి పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రెజ్లర్లపై నమోదైన పోలీసు కేసుల ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలిపారు. జూన్ 15 వరకు నిరసనలను తాత్కాలికంగా నిలిపేసేందుకు రెజ్లర్లు అంగీకరించారు. అయితే పూనియా విలేకర్లతో మాట్లాడుతూ, జూన్ 15 నాటికి బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోకపోతే తాము నిరసనలను పునరుద్ధరిస్తామని చెప్పారు. రెజ్లర్లు జూన్ 4న రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బ్రిజ్ భూషణ్‌పై సాధ్యమైనంత త్వరగా ఛార్జిషీటును దాఖలు చేయాలని కోరారు.

తాము సాధించిన పతకాలను హరిద్వార్‌లోని గంగా నదిలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించి, మే 30న హరిద్వార్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్ విజ్ఞప్తి మేరకు వీరు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రభుత్వం కదిలివచ్చి, చర్యలు ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి :

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల

2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..

Updated Date - 2023-07-07T16:24:59+05:30 IST