Mahua Moitra: 'బంగ్లా' వ్యవహారంలో మహువ మొయిత్రా పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 19 , 2023 | 07:16 PM
ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్‌పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ నేత మహువా మొయిత్రా (Mahua Moitra) అధికార నివాసం కూడా ఖాళీ చేయాల్సి రావడంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు (Delhi Hich court) మంగళవారంనాడు వాయిదా వేసింది. పిటిషన్‌పై 'స్టే' ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను 2024 జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
లోక్‌సభ సభ్యత్వం రద్దును సవాలు చేస్తూ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణలో ఉన్న విషయాన్ని విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమణియం ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ముందస్తుగానే హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో జనవరి 3న విచారణ ఉన్నందున 4వ తేదీకి తమ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం కోల్పోయినందున ఆమెకు కేటాయించిన అధికారిక నివాసాన్ని గృహ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్ ఇటీవల రద్దు చేసింది. 2024 జనవరి 7వ తేదీ కల్లా బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిని హైకోర్టులో మొయిత్రా సవాలు చేశారు. ఈ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని, లేని పక్షంలో 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ అయినా తనను అదే బంగ్లాలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆమె కోరారు. ఎంపీ సభ్యత్వానికి అనర్హత వేటు వేయడంతో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుందని, భాగస్వామ్య పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుందని, ఇదే సమయంలో ఇల్లు వెతుక్కోవడం కష్టమని ఆమె కోర్టుకు విన్నవించారు. ఢిల్లీలో తాను ఒంటరిగా ఉంటున్నానని, తనకు కేటాయించిన భవనంలోనే కొనసాగేందుకు అవసరమైతే అదనపు ఖర్చు చెల్లించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు.