AAP MP Sanjay Singh: అరెస్టు, రిమాండ్‌పై ఆప్ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు..
ABN , First Publish Date - 2023-10-20T19:54:21+05:30 IST
లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ సింగ్ కు ఢిల్లీ హైకోర్టులో శుక్రవారంనాడు చుక్కెదురైంది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కేసు ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case)లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ సింగ్ (Sanjay Singh)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High court)లో శుక్రవారంనాడు చుక్కెదురైంది. తన అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో తాను ఎలాంటి అనుమానితుడు కానీ, నిందితుడు కానీ కాదని, ఏడాదిన్నరలో తనపై ఒక మెయిన్ ఛార్జిషీటు, రెండు అనుబంధ ఛార్జిషీట్లు నమోదు చేయడం మినహా జరిగిందేమీ లేదని, తనకు ఎలాంటి ప్రమేయం ఇందులో లేదని సంజయ్ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, రిమాండ్, అరెస్టు ఉత్తర్వలో తాము జోక్యం చేసుకునేందుకు తగిన కారణం కనిపించడం లేదని న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణలో ఉన్న పరిస్థితిలో ముందస్తుగా జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.
విచారణపరంగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించే సింగ్‌ను తాము అరెస్టు చేశామని ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌రాజు కోర్టుకు విన్నవించారు. తమ విచారణలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కుట్రలో సింగ్ పాలుపంచుకన్నట్టు వెల్లడైందని, డినేష్ అరోరా, అమిత్ అరోరాతో ఆయన సన్నిహతంగా వ్యవహరించారని తెలిపారు. ఆల్కహాల్ దుకాణాలు, మర్చెంట్లకు లైసెన్సులు ఇవ్వాలనే నిర్ణయంలో సింగ్, ఆయన అసోసియేట్ల పాత్ర ఉందని ఈడీ ఆరోపణగా ఉంది. కాగా, ఈ కేసులో సంజయ్ సింగ్ జ్యూడిషియల్ కస్టడీని అక్టోబర్ 27 వరకూ విచారణ కోర్టు గతవారం పొడిగించింది. ఇటీవల సంజయ్ సింగ్‌ను ఆయన నివాసంలో రోజంతా ప్రశ్నించిన ఈడీ ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసింది. ఇదే కేసులో ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సోసిడియా గత మార్చిలో అరెస్టయ్యారు.