Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ABN , First Publish Date - 2023-04-12T14:19:37+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో..

Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ (Delh Government excise policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కమ్యూనికేషన్ ఇన్‌చార్జి విజయ్ నాయర్ దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు (ED) ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. తదుపరి విచారణ తేదీని మే 19వ తేదీకి వాయిదా వేసింది. ఆప్‌తో ఉన్న రాజకీయ అనుబంధం కారణంగానే తనను బలిపశువును చేశారని బెయిలు పిటిషన్‌లో నాయర్ కోర్టుకు విన్నవించారు.

గత ఫిబ్రవరిలో నాయర్, మరికొందరి బెయిల్ అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మనీ లాండరింగ్‌లోని సెక్షన్ 3 కింద నిందితులపై చేసిన అభియోగాలు చాలా తీవ్రమైనవని, కేసు విచారణ దశలో ఉన్నందున ఈ సమయంలో బెయిలుపై విడుదల చేయలేమని విచారణ కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును నాయర్ ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన ధర్మాసనం బుధవారంనాడు విచారణ చేపట్టింది. దీనిపై ఈడీ వివరణ కోరుతూ నోటీసులు పంపింది.

కాగా, ఇదే కేసులో దక్షిణాది వ్యాపారులు బినయ్ బాబు, అభిషేక్ బోయిన్‌పల్లి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేశారు. లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ నమోదు చేసిన రెండవ ఛార్జిషీటులో విజయ్ నాయర్, శరత్ రెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్‌ ఆరోరా, మరో 7 కంపెనీల పేర్లు చోటుచేసుకున్నాయి. ఎక్సైజ్‌ కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి విచారణ కోర్టు ఇంతకముందు బెయిల్ ఇచ్చింది. అయితే విచారణ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాలు చేసింది. ప్రస్తుతం ఇది కోర్టు విచారణలో ఉంది.

Updated Date - 2023-04-12T14:23:39+05:30 IST