DU women’s hostel : హోళీ సంబరాలపై ఆంక్షలు... ఢిల్లీ విద్యార్థినుల నిరసన...
ABN , First Publish Date - 2023-03-08T17:22:16+05:30 IST
హోళీ (Holi) పండుగ సందర్భంగా అమలు చేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (Delhi University)లోని రాజీవ్ గాంధీ బాలికల వసతి గృహం
న్యూఢిల్లీ : హోళీ (Holi) పండుగ సందర్భంగా అమలు చేస్తున్న ఆంక్షలపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (Delhi University)లోని రాజీవ్ గాంధీ బాలికల వసతి గృహం (Rajiv Gandhi Hostel for Girls) విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు హాస్టల్ ప్రాంగణం బయటకు వెళ్ళకూడదని తమపై ఆంక్షలు విధించారని ఆరోపిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ సెక్షన్ ఆఫీసర్ మార్చి 2న విడుదల చేసిన నోటీసులో, ఈ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు హోళీ పండుగ రోజున (మార్చి 8న) సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్ళవచ్చునని తెలిపారు. ఆ రోజున అతిథులు లేదా సందర్శకులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఈ ఆంక్షలు సమర్థనీయం కాదని విద్యార్థినులు విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు తమను హాస్టళ్లకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. తాము బయటకు వెళ్ళకుండా గేట్లకు తాళాలు వేశారన్నారు. ఈ చర్యలు నిరంకుశమైనవని మండిపడ్డారు.
దీనిపై విశ్వవిద్యాలయం ప్రాక్టర్ రజిని అబ్బి స్పందిస్తూ, ఈ నోటీసును ప్రతి సంవత్సరం పంపిస్తామని, విద్యార్థినులు సంతకం చేసి, బయటకు వెళ్ళవచ్చునని చెప్పారు.
ఎంఏ ఫైనల్ ఇయర్ విద్యార్థిని దీపాంషి మాట్లాడుతూ, బాయ్స్ హాస్టల్‌లో ఇటువంటి ఆంక్షలు లేవన్నారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న ఇతర హాస్టళ్ళలోని తమ తోటి విద్యార్థినులతో సైతం మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. తమ కుటుంబ సభ్యుల పేర్లు, కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వాలని అధికారులు కోరుతున్నారన్నారు. ఆహార పదార్థాలను తెచ్చుకుందామన్నా సంతకం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి :
China Vs Taiwan : చైనా ఇలాంటి యుద్ధం మొదలెడుతుందని ఎవరూ ఊహించలేదు!
United Nations : మహిళల అణచివేతలో ఆఫ్ఘనిస్థాన్‌దే పైచేయి : ఐరాస