Share News

Delhi Pollution:ఢిల్లీలో 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం నేటి నుంచి మళ్లీ ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-26T11:02:08+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ గురువారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 256 పాయింట్లుగా రికార్డ్ అయి ఎయిర్ క్వాలిటీ పేలవంగా మారింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మళ్లీ "రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్" ప్రచారం ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఇంజిన్ ఆపేయాలని చెప్పడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం.

Delhi Pollution:ఢిల్లీలో 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం నేటి నుంచి మళ్లీ ప్రారంభం

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ గురువారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత 256 పాయింట్లుగా రికార్డ్ అయి ఎయిర్ క్వాలిటీ పేలవంగా మారింది. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మళ్లీ "రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్" ప్రచారం ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఇంజిన్ ఆపేయాలని చెప్పడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. తద్వారా వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR-India) ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో వాయు నాణ్యత 256గా నమోదైంది.


కాలుష్యాన్ని తగ్గించేందుకు, ఆనంద్ విహార్లో యాంటీ స్మోగ్ గన్ ద్వారా నీటిని చల్లారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం జహంగీర్‌పురి ప్రాంతంలో AQI గరిష్టంగా 349కి చేరుకుంది. వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన ప్లస్" విభాగంలోకి వస్తుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో క్రాకర్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీపావళి సందర్భంగా ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల పర్యావరణ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్(Bhupender Yadav) వారం క్రితం సమావేశం నిర్వహించారు. దీపావళి పండుగ రానుండటంతో కాలుష్య తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


నగరంలో బాణాసంచా తయారీ, నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు గతంలో ఢిల్లీ ప్రకటించింది. బాణసంచా కాల్చడాన్ని తగ్గించేందుకు "పటాకే నహీ దియా జలావో" అనే ప్రజా చైతన్య కార్యక్రమాన్ని సైతం మళ్లీ ప్రారంభించనుంది. ఈ ఏడాది దసరాకు నమోదైన వాయు కాలుష్య తీవ్రత రెండేళ్ల రికార్డును చెరిపేసింది. అయితే ఢిల్లీలో వాయు నాణ్యత పెరగాలంటే చాలా మార్పులు రావాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డీజిల్ తో నడిచే వాహనాలను సంపూర్ణంగా నిషేధించి.. పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాలు వాడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో క్రాకర్స్, చెరుకు తదితర పంటల్ని కాల్చడం ఆపాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-10-26T11:02:08+05:30 IST