Delimitation: ఇదొక రాజకీయ యుక్తి, దక్షిణాది రాష్ట్రాలపై కత్తి వేలాడుతోంది... సీఎం స్టాలిన్ ఫైర్
ABN , First Publish Date - 2023-09-20T15:11:26+05:30 IST
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడంపై అటు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారత రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament Specail session) మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill)ను కేంద్రం ప్రవేశపెట్టడంపై అటు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, అటు పార్లమెంటు వెలుపల కూడా బిల్లు ఉద్దేశాలు, ప్రవేశపెట్టిన సమయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనను (delimatation) దక్షిణ భారత రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తిగా డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
''ఇదొక రాజకీయ యుక్తి. జనాభా ఆధారంగా పార్లమెంటు సీట్లు పెరిగితే దక్షిణ భారత రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుంది'' అని సీఎం కార్యాలయం (సీఎంఓ) ఆ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇది రాజకీయంగా చైతన్యం కలిగిన తమిళనాడు వంటి రాష్ట్రాలను మొగ్గలోనే తుంచివేసే చర్యగా తప్పుపట్టింది.
హాని చేయమని ప్రధాని హామీ ఇవ్వాలి..
''మహిళా రిజర్వేషన్ బిల్లును మేము స్వాగతిస్తున్నాం. కానీ, ఇదే సమయంలో డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది ప్రజలకు ఎలాంటి నష్టం చేయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలకున్న భయాందోళనలను ప్రధాని తొలిగించాల్సిన అవసరం ఉంది'' అని అని సీఎంఓ పేర్కొంది. కాగా, బిల్లు చట్టం కాగానే జనగణన, డీమిలిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. అది పూర్తి అయిన తర్వాతే బిల్లు అమల్లోకి వస్తోంది.