Devendra Fadnavis: ఉద్ధవ్ శివసేనలో తీవ్ర అశాంతి... ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-05-30T17:08:34+05:30 IST
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు నలుగురు వ్యక్తుల కారణంగా ఉద్ధవ్ థాకరే శివసేనలో తీవ్ర అశాంతి నెలకొందని అన్నారు. అయితే, ఆ వ్యక్తులెవరనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు.
ముంబై: ఉద్ధవ్ థాకరే (Uddhav Tackeray) సారథ్యంలోని శివసేన (Shiv Sena)పై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మంగళవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు నలుగురు వ్యక్తుల కారణంగా ఉద్ధవ్ థాకరే శివసేనలో తీవ్ర అశాంతి నెలకొందని అన్నారు. ఆ వ్యక్తులెవరనేది ఆయన చెప్పడానికి నిరాకరించారు. త్వరలోనే ఆ విషయాలు బయటకు వస్తాయని, అందరికీ తెలుస్తుందని, ఇప్పుడే దాని గురించి తాను మాట్లాడటం సరికాదని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. శివసేన (UBT) పార్టీ పత్రిక 'సామ్నా'లో వచ్చిన సంపాదకీయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'సామ్నా' ఏమి చెప్పింది?
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు 'సామ్నా' సంపాదకీయ పేర్కొంది. బీజేపీ అనుసరిస్తున్న సవతి తల్లి వైఖరితో ఈ 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, షిండే వర్గంలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారని ఆ సంపాదకీయం రాసింది.
ఆసక్తికరంగా, శివసేన వ్యవస్థాప దినోత్సవం జూన్ 19న జరగనుండటంతో ఇటు షిండే వర్గం శివసేన, ఉద్ధవ్ థాకరే వర్గం తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తు్న్నారు. పార్టీపై తమ హక్కును చాటుకునేందుకు శివసేన రెండు వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ మంగళవారంనాడు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
శివసేన 2022 జూన్‌లో రెండు వర్గాలుగా చీలిపోయింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని 56 మంది శివసేన ఎమ్మెల్యేలు షిండే వర్గానికి మద్దుతు ప్రకటించడంతో పార్టీ రెండుగా చీలిపోయింది. 18 మంది శివసేన ఎంపీల్లో 12 మంది షిండే వర్గంలో చేరిపోయారు. ప్రస్తుతం థాకరే వర్గంలో 16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు ఉన్నారు. శివసేనలో చీలిక ఏర్పడినప్పటికీ థాకరే శివసైనికుల్లో పట్టు కొనసాగిస్తున్నారు. బీజేపీతో కలిసి థాకరే సంస్థాగత మూలాలను దెబ్బతీసేందుకు షిండే వర్గం ప్రయత్నాలు సాగిస్తోంది.