Share News

Uddhav Thackeray: మన తలుపు వరకు నియంతృత్వం చేరింది..మనం దానిని ఆపాలి..

ABN , Publish Date - Dec 25 , 2023 | 07:30 PM

దేశ ముఖద్వారం వరకూ నియంతృత్వం వచ్చి చేరిందని, దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈస్ట్ ముంబైలోని కుర్లాలో సోమవారంనాడు జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొన్నారు.

Uddhav Thackeray: మన తలుపు వరకు నియంతృత్వం చేరింది..మనం దానిని ఆపాలి..

ముంబై: దేశ ముఖద్వారం వరకూ నియంతృత్వం వచ్చి చేరిందని, దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) అన్నారు. ఈస్ట్ ముంబైలోని కుర్లాలో సోమవారంనాడు జరిగిన జైన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల ప్రస్తావన చేస్తూ, దేశం సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందని, ఈ దేశాన్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఈసారి మనం తప్పు చేస్తే దేశంలో నియంతృత్వం వస్తుందని అన్నారు.


''దేశానికి స్వాతంత్ర్యం కావాలి. ఒకానొప్పుడు స్వాతంత్ర్యం కోసం పోరాడాం, ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛను కాపాడుకునేందుకు పోరాడాలి. నేను చేయగలిగినది నేను చేస్తా. దేశంలో ఒకరకమైన గందరగోళ వాతావరణం ఉంది. నియంతృత్వం మన తలుపు వరకూ వచ్చింది. దానిని మనం ఆపాలి'' అని ఉద్ధవ్ అన్నారు.జైన్ కమ్యూనిటీ ఆశీస్సుల కోసమే తాను ఇక్కడకు వచ్చానని, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించికాదని చెప్పారు. తనకు తన తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయని, వారు గర్వించే పనులు చేయాలని తాను కోరుకుంటున్నానని, దేశం కోసం జైన్ కమ్యూనిటీ ఆశీస్సులు తనకు కావాలని ఆయన కోరారు.


బాలాసాహెబ్ థాకరే స్థాపించిన శివసేన పార్టీ గత ఏడాది జూన్‌లో చీలిపోయింది. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపారు. 2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత అప్పటి థాకరే సారథ్యంలోన శివసేన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహా వికాష్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్ష 'ఇండియా' కూటమిలో శివసేన (యూబీటీ) భాగస్వామిగా ఉంది.

Updated Date - Dec 25 , 2023 | 07:31 PM