Opposition parties: మోదీపై అవిశ్వాసం!

ABN , First Publish Date - 2023-07-26T03:08:30+05:30 IST

కొత్త భవనంలో ప్రారంభమైన తొలి రోజు నుంచే మణిపూర్‌ అల్లర్ల(Manipur riots)పై అట్టుడుకుతున్న పార్లమెంటు సమావేశాలు(Sessions of Parliament) మరో మలుపు తీసుకున్నాయి.

Opposition parties: మోదీపై అవిశ్వాసం!

మణిపూర్‌పై ప్రతిపక్షాల వ్యూహం

నేడు పార్లమెంటరీ పార్టీ నేతల భేటీ

లోక్‌ సభలో ప్రవేశపెట్టే అవకాశం

4వ రోజూ సాగని సమావేశాలు

ఇండియా కూటమి సభ్యుల వాకౌట్‌

మణిపూర్‌ సమస్య పరిష్కరిస్తాం

కీలక బిల్లులకు సహకరించండి: షా

తెలంగాణలో దారుణాలపైనా

షా జవాబిస్తారు: గోయల్‌

న్యూఢిల్లీ, జూలై 25(ఆంధ్రజ్యోతి): కొత్త భవనంలో ప్రారంభమైన తొలి రోజు నుంచే మణిపూర్‌ అల్లర్ల(Manipur riots)పై అట్టుడుకుతున్న పార్లమెంటు సమావేశాలు(Sessions of Parliament) మరో మలుపు తీసుకున్నాయి. ఎంత పట్టు పడుతున్నా ప్రధాని సమాధానం ఇచ్చే అవకాశం లేకపోవడంతో విపక్షాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. మణిపూర్‌పై మోదీ(PM MODI) నోరిప్పాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే మార్గమని నిశ్చయించాయి. తీర్మానానికి జవాబిచ్చే సమయంలోనైనా ప్రధాని మణిపూర్‌పై మాట్లాడతారని ప్రతిపక్షాలు వ్యూహం పన్నాయి. అవిశ్వాసంపెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యుల సంతకాలతో తీర్మానం డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలిసింది. బుధవారమే లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీనికిముందు ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్‌ లీడర్లు సమావేశం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌(Congress) లోక్‌సభ ఎంపీలకు విప్‌ జారీచేసింది. ఇతర విపక్ష సభ్యులు ఉదయం 10.30కు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో, 10 గంటల సమయంలో ఫ్లోర్‌ లీడర్లు రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే ఛాంబర్‌లో కలుసుకోనున్నారు.


కాగా, మంగళవారం సైతం ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. వివిధ మార్గాలను చర్చించి.. మణిపూర్‌పై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి వచ్చారు. రాజ్యసభలో మణిపూర్‌పై 267 నిబంధన కింద చర్చ డిమాండ్‌ నుంచి పక్కకు తప్పుకోకూడదని నిర్ణయించారు. కాగా, మణిపూర్‌పై మోదీ సమాధానం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌పై విపక్షాలు వెనక్కుతగ్గకపోవడంతో 4వ రోజు కూడా ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మైక్‌ను చైర్మన్‌ కట్‌ చేయడంతో నిరసనగా ఇండియా కూటమి పార్టీలన్నీ వాకౌట్‌ చేశాయి. ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ను సెషన్‌ అంతటికీ సస్పెండ్‌ చేయడంపై విపక్షాలన్నీ సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించాయి. కాగా, ప్రతిష్ఠంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చొరవ చూపారు. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ చైర్మన్‌ ధన్‌ఖడ్‌ సైతం ఇదే ప్రయత్నం చేశారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ సహా పలువురు విపక్ష సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఇవేవీ ఫలించలేదు. ఇక గందరగోళం మఽధ్యే రాష్ట్రాల బహుళ సహకార సంఘాల సవరణ, ఇతర బిల్లులను ఆమోదించారు.


ఖర్గే, అధిర్‌కు షా లేఖ

మణిపూర్‌పై చర్చకు ప్రతిష్టంభన తొలగేలా సహకరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖర్గే, అధిర్‌ రంజన్‌ ఇతర విపక్ష నేతలకు లేఖ రాశారు. ఆరేళ్లుగా మణిపూర్‌ బీజేపీ పాలనలో ప్రశాంతంగా ఉందని.. కొన్ని కారణాలు, కోర్టు తీర్పులతో అలజడి రేగిందని పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌, మణిపూర్‌పై పరిష్కారానికి కృషి చేస్తామని, కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కోరారు. సభ జరిగేలా తోడ్పడాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ కూడా విపక్ష నేతలకు ఫోన్‌ చేశారు.

ఐదేళ్ల కిందట జూలైలోనే మోదీ తొలి విడత సర్కారుపై 2018 జూలై 20న విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మళ్లీ ఇప్పుడు జూలైలోనే పెట్టనున్నాయి.

ఖర్గే-గోయల్‌ వాగ్వాదం

మణిపూర్‌పై రాజ్యసభ ప్రారంభంలోనే ఖర్గే, సభా పక్షనేత, కేంద్ర మంత్రి గోయల్‌ మధ్య వాగ్వాదం జరిగింది. మోదీ సమాధానానికి ఖర్గే పట్టుబట్టగా.. షా మాట్లాడతారని గోయల్‌ పేర్కొన్నారు. తెలంగాణతో పాటు విపక్ష పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన దారుణాల మీదా సమాధానం ఇస్తారని చెప్పారు. కాగా, మణిపూర్‌ అశాంతి మిగతా ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపిస్తోందని, మోదీ అహాన్ని పక్కనపెట్టాలని ఖర్గే ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-07-26T03:08:30+05:30 IST