DMK: బీజేపీ తొమ్మిదేళ్ళ పాలనపై పోరు.. 37 ద్రోహాలతో జాబితా
ABN , First Publish Date - 2023-07-15T08:11:59+05:30 IST
త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK
- డీఎంకే ఎంపీల సమావేశంలో తీర్మానం
అడయార్(చెన్నై): త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.. గత తొమ్మిదేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసిన మోసం, జరిగిన ద్రోహాన్ని నిలదీయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో బీజేపీ చేసిన మోసాలు, తప్పులను కూడా ఎత్తిచూపుతూ ఒక జాబితా తయారు చేసి, వాటిని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నేషనల్ లా కమిషన్‌కు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister MK Stalin) అధ్యక్షతన డీఎంకే ఎంపీలు శుక్రవారం తేనాంపేటలోని అన్నా అరివాలయం ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఇందులో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్ బాలు, ఉప ప్రధాన కార్యదర్శులు ఐ.పెరియస్వామి, పొన్ముడి, ఆందియూర్ సెల్వరాజ్, కనిమొళి, ఎ.రాజా, దయానిధి మారన్, తమిళచ్చి తంగపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమేశంలో అన్ని అంశాలపై చర్చించి కొన్ని కీలక తీర్మానాలు చేశారు. గత తొమ్మిదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు ఏర్పడిన కష్టాలతో పాటు తమిళనాడును, తమిళ ప్రజలను బహిష్కరించడమే కాకుండా చేసిన మోసాన్ని పార్లమెంట్ సమావేశంలో ఎండగట్టాలని తీర్మానించారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోగా, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకపోవడం తదితర అంశాలపై బీజేపీ సర్కారు వైఖరిని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని తీర్మానించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు చెల్లించకపోవడం, విద్యుత్ చార్జీలు పెంచడం, ఎయిమ్స్ నిర్మాణాన్ని పక్కనబెట్టడం, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించే గవర్నర్‌ను నియమించిన అంశంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కేటాయించాల్సిన చక్కెర, గోధుమ, కిరోసిన్, పప్పు దినుసులు, బియ్యం కోటా తగ్గించడం, అభివృద్ధి పథకాలకు కేంద్ర నిఽధుల వాటా తగ్గింపు, ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత, రైలు ప్రాజెక్టుల్లో రాష్ట్రంపై చిన్నచూపు, రాష్ట్రానికి చెందిన విద్యార్థులపై కక్షతో నీట్ అమలు, తమిళ భాషను నిర్వీర్యం చేస్తూ సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇవ్వడం, సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మద్రాస్ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకం.. ఇలా బీజేపీ 9 యేళ్ళ పాలనలో రాష్ట్రానికి జరిగిన మోసాన్ని ఎండగట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు.