Hindi Row : కొత్త బిల్లులకు హిందీ పేర్లపై డీఎంకే అభ్యంతరం
ABN , First Publish Date - 2023-08-12T16:24:42+05:30 IST
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన కొన్ని బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం తెలిపింది. బ్రిటిష్ కాలంనాటి మూడు చట్టాలను సంస్కరించేందుకు భారతీయ పేర్లతో ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు.
చెన్నై : కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన కొన్ని బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం తెలిపింది. బ్రిటిష్ కాలంనాటి మూడు చట్టాలను సంస్కరించేందుకు భారతీయ పేర్లతో ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS)ను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC), 1898ను సంస్కరించి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS)ను, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం, 1872 స్థానంలో భారతీయ సాక్ష్యను రూపొందించారు.
ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ విల్సన్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం హిందీని దేశమంతటికీ రుద్దుతోందన్నారు. ఈ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లిష్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. హిందీని తప్పనిసరి చేస్తూ, అమలు చేయకూడదన్నారు. ఇలా చేయడం హిందీని తమపై రుద్దడమేనన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
భారత దేశంలో చాలా భాషలు ఉన్నాయని, ఇంగ్లిష్ కామన్ లాంగ్వేజ్ అని చెప్పారు. ఈ మూడు బిల్లులు హిందీలో ఉన్నాయన్నారు. ఏ బిల్లు ఏమిటో ప్రజలకు అర్థం కాదన్నారు. ఆ పేర్లు పలకడం చాలా కష్టమన్నారు. ఇది దేశమంతటికీ హిందీని బలవంతంగా రుద్దడమే అవుతుందని మండిపడ్డారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ శుక్రవారం మాట్లాడుతూ, ఈ మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని తెలిపారు. డీకాలనైజేషన్ పేరుతో రీకాలనైజేషన్ చేయడానికి ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఇది సమైక్య భారత దేశ మూలాలను కించపరచడమేనన్నారు. ఇకపై తమిళం అనే పదాన్ని ఉచ్చరించడానికైనా బీజేపీకి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నైతిక హక్కు లేదన్నారు. తమ గుర్తింపును హిందీతో వెనుకకు నెట్టేందుకు జరిగే ప్రయత్నాలను దృఢంగా వ్యతిరేకిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి :
UP Assembly : నవ్వులు పూయించిన యోగి ఆదిత్యనాథ్, శివపాల్ యాదవ్ సంభాషణ