Supreme Court : పెళ్లయిన పురుషులకు గృహ హింస... కాపాడాలంటూ సుప్రీంకోర్టుకు...

ABN , First Publish Date - 2023-03-15T15:49:16+05:30 IST

వివాహితులైన పురుషులు (Married Men) గృహ హింసకు గురవుతున్నారని, ఫలితంగా వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని

Supreme Court : పెళ్లయిన పురుషులకు గృహ హింస... కాపాడాలంటూ సుప్రీంకోర్టుకు...
Supreme Court

న్యూఢిల్లీ : వివాహితులైన పురుషులు (Married Men) గృహ హింసకు గురవుతున్నారని, ఫలితంగా వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ఓ పిటిషన్ దాఖలైంది. పురుషుల కోసం ఓ జాతీయ కమిషన్‌ (National Commission for Men)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఈ పిటిషన్ కోరింది. న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) వెల్లడించిన సమాచారం ప్రకారం, 2021లో ప్రమాదవశాత్తూ సంభవించిన మరణాలు 1,64,033 అని ఈ పిటిషన్ పేర్కొంది. వీరిలో 81,063 మంది పెళ్లయిన పురుషులని తెలిపింది. వివాహిత మహిళలు 28,680 మంది ప్రమాదవశాత్తూ మరణించినట్లు ఈ నివేదిక పేర్కొన్నట్లు తెలిపింది. మరణించిన పురుషుల్లో 33.2 శాతం మంది మరణానికి కారణం కుటుంబ సమస్యలని, 4.8 శాతం మంది మరణానికి కారణం వివాహ సంబంధితమైనవని తెలిపింది. 2021లో 1,18,979 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారని, 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించిందని పేర్కొంది.

గృహ హింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. గృహ హింస బాధిత పురుషుల సమస్యల పరిష్కారానికి తగిన చట్టం అమల్లోకి వచ్చే వరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని కోరింది. కుటుంబ సమస్యల ఒత్తిళ్ళలో ఉన్నవారు, వివాహ సంబంధిత సమస్యలపై పురుషులు చేసే ఫిర్యాదులను కూడా పోలీసులు స్వీకరించాలని కోరింది. దీని కోసం తగిన ఆదేశాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పోలీసు అధికారులు/స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు జారీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. ఈ ఫిర్యాదులు సరైనరీతిలో పరిష్కారమయ్యేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు నివేదించాలని కోరింది.

గృహ హింస లేదా కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వివాహిత పురుషుల ఆత్మహత్యలపై పరిశోధన జరపాలని శాసన పరిశీలక సంఘం (Law Commission)ను ఆదేశించాలని కోరింది. జాతీయ పురుషుల కమిషన్ వంటి వేదికను ఏర్పాటు చేసేందుకు తగిన నివేదికను సమర్పించాలని ఆదేశించాలని కోరింది.

ఇవి కూడా చదవండి :

Congress : భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ... పార్లమెంటుకు వెళ్తారా?...

Excise Policy : మద్యం విధానంపై కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

Updated Date - 2023-03-15T15:49:16+05:30 IST