Karnataka Assembly Elections: బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ తిమ్మప్ప కుమార్తె
ABN , First Publish Date - 2023-04-12T16:15:40+05:30 IST
రాజనందిని బీజేపీలో చేరడంపై ఆమె తండ్రి తిమ్మప్ప స్పందించారు. తన కుమార్తె బీజేపీలో చేరడం దురదృష్టకరమని తిమ్మప్ప అభిప్రాయపడ్డారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకిస్తూ మాజీ స్పీకర్ తిమ్మప్ప (former Speaker Kagodu Thimmappa) కుమార్తె రాజనందిని (Dr Rajanandini) భారతీయ జనతా పార్టీలో(BJP) చేరారు. కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని తాను ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. మరోవైపు రాజనందిని బీజేపీలో చేరడంపై ఆమె తండ్రి తిమ్మప్ప స్పందించారు. తన కుమార్తె బీజేపీలో చేరడం దురదృష్టకరమని తిమ్మప్ప అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ వాదినేనని, తన కుమార్తె ఇంత పని చేస్తుందని తాను ఊహించలేకపోయానన్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీకి చెందిన హలప్ప పనే అయ్యుంటుందని తిమ్మప్ప అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నాలుగు రోజులుగా కసరత్తు చేసి ఎట్టకేలకూ తొలి జాబితా రూపొందించి విడుదల చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర సహా 189 మంది అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. 8 మంది మహిళలకు చోటు దక్కింది. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్.అశోక బరిలోకి దిగనున్నారు. సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్ స్థానంలో యశ్‌పాల్ సువర్ణకు అవకాశమిచ్చారు.
కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది. కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల వేళ ఇప్పటివరకూ వెయ్యికిపైగా ఎఫ్‌ఐఆర్‌లు(FIR) నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొత్తం 126 కోట్ల రూపాయల నగదుతో పాటు మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.