Dussehra: రాష్ట్రంలో.. సాదాసీదాగా దసరా వేడుకలు.. కారణం ఏంటంటే...
ABN , First Publish Date - 2023-09-23T10:27:02+05:30 IST
రాష్ట్రంలోని 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత మైసూరు
- కరువు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 195కుపైగా తాలూకాల్లో కరువు పరిస్థితులు నెలకొని ఉండడం, కావేరి జలవివాదం నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను(Mysore Dussehra Festivals) ఈసారి సాదాసీదాగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ అనంతరం ఈసారి దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని అంతకుముందు నిర్ణయించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో వెనక్కి తగ్గింది. ఆడంబరంగా దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో అనుకోని కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప శుక్రవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతాంగం కరువు పరిస్థితి బారిన పడి అలమటిస్తున్న తరుణంలో వైభవోపేత దసరా నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. సాదాసీదా దసరా ఉత్సవాల రూపురేఖలను మైసూరు జిల్లా అధికారులతో చర్చించిన అనంతరం ప్రకటిస్తారు. జంబూ సవారీని నిర్వహించే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.