Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
ABN , First Publish Date - 2023-10-03T15:49:33+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఎన్‌సీఎస్ ప్రకారం భూకంపం మూలం నేపాల్‌లో 5 కిలో మీటర్ల లోతులో ఉంది. భూకంపం కారణంగా ఉత్తర భారతదేశంలోని అనేక మంది ప్రజలు ఒక నిమిషం పాటు బలమైన భూప్రకంపనలను అనుభవించారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇటీవల అస్సాం, మేఘాలయలో కూడా భూమి కంపించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో టర్కియే, సిరియాలో సంభవించిన వినాశకరమైన భూకంపాలను అంచనా వేసిన డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. పాకిస్థాన్ సమీపంలో ఉద్భవించే భూకంపం సంభావ్యత గురించి ఎక్స్‌లో(ట్విట్టర్)లో సోమవారం పోస్ట్ చేశారు. "సెప్టెంబర్ 30న మేము పాకిస్థాన్, దాని సమీపంలోని కొన్ని ప్రాంతాల వాతావరణ హెచ్చుతగ్గులను నమోదు చేసాము. ఇది సరైనది. ఇది రాబోయే బలమైన ప్రకంపనలకు సూచిక కావచ్చు (మొరాకోలో జరిగినట్లుగా). కానీ అది జరుగుతుందని మేము ఖచ్చితంగా చెప్పలేము "అని పేర్కొన్నారు.